‘RRR’ నుండి ఆ సీన్ తొలగించాలి.. భీం ముని మనవడు

టాలీవుడ్ అగ్ర హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో RRR సినిమాని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. తాజాగా ‘RRR’ నుండి నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఎన్టీఆర్ పాత్ర కు సంబంధించిన టీజర్ ఇటీవల అక్టోబర్ 22 న కొమురం భీం జయంతి సందర్భంగా విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటె తాజాగా ఈ టీజర్‌లో కొమరం భీమ్ ముస్లిం టోపీ తొడిగినట్టు చూపించడంపై ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్, జైనూర్ కొమురం భీమ్ యువసేన నాయకులు ఆందోళన చేపట్టారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడికి టోపి పెట్టడం ఏంటని నిలదీశారు.కొమురం భీమ్ చరిత్రను అర్ధం చేసుకొని సినిమా తీయాలని.. గిరిజనుల మనోభావాలను దెబ్బ తీయొద్దని.. వెంటనే ఆ దృశ్యాలను తొలగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కొమరం భీం మునిమనవడు సొనేరావు సైతం దీనిపై స్పందించారు.

”రాజమౌళి సినిమాపై మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కొమరం భీం చరిత్ర గురించి మమ్మల్ని సంప్రదిస్తే పూర్తి వివరాలు ఇచ్చేవాళ్లం. భీంను మైనారిటీగా చూపించారు. అది మా ఆదివాసీల గౌరవాన్ని దెబ్బతీసింది. మేము దేవుడిగా కొలిచే వ్యక్తిని అలా చూపించి మమ్మల్ని కించపరిచారు. ఆ సీన్‌ను తొలగించాలని కోరుతున్నాం” అని పేర్కొన్నారు.ఒకవైపు రాజమౌళి దాని గురించి క్లారిటీ ఇస్తున్న కూడా ఎవ్వరూ వినడం లేదు. సినిమాలో ఏం చూపించిన పర్వాలేదు కానీ.. ముస్లిం వేషధారణకు సంబంధించిన సీన్ మాత్రం తొలిగించాల్సిందే అని అంటున్నారు ఆదివాసీలు. మరి దీనికి రాజమౌళి సమాధానం ఏంటా అన్నది ఇంకా తెలియాలి.