కిలో ఉల్లి రూ.40 కే అందిస్తున్న AP ప్రభుత్వం

సామాన్యులకు కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లి ఘాటు విషయంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రైతు బజార్ల ద్వారా శుక్రవారం నుంచి ఒక్కో కుటంబానికి కిలో ఉల్లిని రూ. 40 చొప్పున అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు చెప్పారు. భారీ వర్షాలు , వరదలతో పంట దెబ్బతినటంతో ఉల్లిధరలు పెరిగాయని.. కిలో రూ.80 వరకుమార్కెట్ లోవిక్రయిస్తున్నారని.. దీంతో ప్రజలకు మేలు జరిగేలా కిలో రూ.40 చొప్పన అందించేందుకు చర్యలు చేపట్టామని ఆయన చెప్పారు.

మొదటి విడతలో పట్టణ, నగర ప్రాంతాల్లోని రైతుబజార్ల ద్వారా విక్రయిస్తామన్నారు. ఉల్లి ధరల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను కాకినాడలో గురువారం మంత్రి విలేకరులకు వివరించారు. 5 వేల టన్నుల ఉల్లిపాయలను దిగుమతి చేసుకునేందుకు నాఫెడ్‌ ద్వారా ఇండెంట్‌ పెట్టామని, అత్యవసరంగా 1,000 టన్నులు దిగుమతి చేసుకుంటున్నామని కన్నబాబు చెప్పారు. కాగా… కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ యార్డులోని ఉల్లిని వెంటనే కొనుగోలు చేసి జిల్లాలకు పంపిణీ చేయాలని మార్కెటింగ్‌ శాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.