పరిషత్‌ ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ

గతంలో కరోనా వ్యాప్తి కారణంగా మధ్యలోనే నిలిచిపోయిన పరిషత్ ఎన్నికలను కొనసాగించేందుకు నూతన ఎస్ఈసీ నీలం సాహ్నీ నోటిఫికేషన్ జారీ చేయడం తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో బీజేపీ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.

ఇక ఈ పిటిషన్ ను అత్యవసర ప్రాతిపదికన కోర్టు ఈ మధ్యాహ్నం విచారించనుంది. ఇప్పటికే జనసేన దాఖలు చేసిన పిటిషన్ కూడా పెండింగ్ లోనే ఉంది. అటు, ఏపీ పరిషత్ ఎన్నికల్లో తమకు పోటీ చేసే అవకాశం కల్పించాలంటూ ముగ్గురు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించగా… అన్ని పిటిషన్లపై కోర్టు నేడు విచారణ జరుపుతుందని భావిస్తున్నారు.

ఏపీలో ఈ నెల 8న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా, 10వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికలను బహిష్కరించాలని టీడీపీ భావిస్తోంది. ఇవాళ ఎస్ఈసీ నిర్వహించిన రాజకీయ పక్షాల సమావేశానికి టీడీపీ సహా జనసేన, బీజేపీ కూడా గైర్హాజరయ్యాయి.