దుబ్బాకలో ఘనవిజయం సాధించిన బిజెపి

తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన దుబ్బాక ఉప ఎన్నికలో బిజెపి జయకేతనం ఎగురువేసింది. బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు దుబ్బాకలో చరిత్ర సృష్టించారు. ఎంతో ఉత్కంఠను రేకెత్తించిన కౌంటింగ్ లో చివరి మూడు రౌండ్లలో బిజెపి ఆధిక్యత సాధించడంతో. బిజెపి చివరకు విజయనాదం చేసింది. 1,470 ఓట్ల మెజార్టీతో రఘునందన్ రావు గెలుపొందారు. గతంలో దుబ్బాక నుంచి రెండు సార్లు పోటీ చేసిన రఘునందన్ రావు.. మూడో ప్రయత్నంలో ఘన విజయం అందుకున్నారు. ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్‌ నుంచీ ఆధిక్యం ప్రదర్శించిన కాషాయ పార్టీ మధ్యలో కాస్త తడబడినప్పటికీ చివరిలో పుంజుకుని అంతిమంగా విజయాన్ని ముద్దాడింది. బిజెపి గెలుపుతో తెలంగాణ వ్యాప్తంగా భాజపా శ్రేణులు సంబరాల్లో మునిగి తేలాయి. హైదరాబాదులోని ప్రధాన కార్యాలయం వద్ద పండుగ వాతావరణం నెలకొంది.