దుర్గం చెరువు పై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి ప్రారంభానికి సిద్ధo

హైదరాబాద్ దుర్గం చెరువు అతి త్వరలోనే ప్రముఖ పర్యాటకంగా దర్శనమివ్వనుంది. ఈ చెరువు పై నిర్మించిన కేబుల్‌ బ్రిడ్జి పనులు పూర్తి కావడంతో వచ్చే వారం కేబుల్ బ్రిడ్జి ప్రారంభానికి సిద్ధమవుతుంది. సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ఈ వంతెన ప్రారంభోత్సవానికి రెడీ అవుతోంది. దుర్గం చెరువుపై నిర్మించిన బ్రిడ్జ్ భారతదేశంలోనే అతిపెద్ద కేబుల్ బ్రిడ్జిగా నిర్మితమైంది. ప్రబుత్వం రూ.184 కోట్ల వ్యయంతో ఈ వంతెనను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. 754. 38 మీటర్ల పొడవైన బ్రిడ్జ్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. మాదాపూర్ జూబ్లీ హిల్స్ మధ్య దూరం తగ్గనుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో బోటింగ్, రెస్టారెంట్‌లను కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని రాష్ట్ర టూరిజం శాఖా మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ మనోహర్‌ను ఆదేశించారు. విద్యుత్‌ వెలుగు జిలుగులు మధ్య కేబుల్‌ బ్రిడ్జిపై విహరిస్తూ దుర్గం చెరువు అందాలను మనసారా చూస్తూ పర్యాటకులు సేదదీరే అరుదైన అవకాశం దక్కనుంది.

1687లో ఔరంగాజేబు సేనలను తిప్పలు పెట్టి గోల్కొండకు నీరందించిన దుర్గం చెరువు భారతదేశంలోని రహస్యతటాకాల్లో ఒకటిగా చరిత్ర నమోదు చేసుకుంది. అయితే కాలగమనంలో పాలకుల నిర్లక్ష్యంతో చెరువు అందాలు అంతరించాయి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడగానే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ చెరువు పునరుద్దరణ పనులు చేపట్టి పర్యాటకంగా అభివృద్ధి చేసింది.