పాడిందే పాట పాచిపళ్ల దాసు తీరుగా ముఖ్యమంత్రి వాఖ్యలు

  • జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గం ఇంచార్జ్ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ధ్వజం

పిఠాపురం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై సామర్లకోట
బహిరింగ సభలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చేసిన వ్యక్తిగత విమర్శలను జనసేన పిఠాపురం నియోజకవర్గ ఇంచార్జి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. పరిపాలనలో ఘోరంగా విఫలమై, అధికారం చేపట్టిన మర్నాటి నుంచే అవినీతి, అక్రమాలు, ఆశ్రీత పక్షపాతంలో రికార్డులు బద్దలుగొడుతున్న ముఖ్యమంత్రి ప్రభుత్వ వైఫల్యాలను నిత్యం ప్రశ్నిస్తున్న ప్రజాసేవకుడు పవన్ కళ్యాణ్ గారిని వేలెత్తిచూపే ధైర్యం లేక, వ్యక్తిగత జీవితంలోకి తొంగిచూస్తూ, నిత్యం మూడు పెళ్లిళ్ల స్తోత్రం చదువుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేసారు. సభ ఏదైనా, సందర్భం ఎలాంటిదైనా పాడిందే పాట పాచిపళ్ల దాసు తీరుగా ముఖ్యమంత్రి వ్యవహరించడం దారుణమన్నారు. ఏటా 5 లక్షల చొప్పున ఐదేళ్ళలో 25 లక్షల ఇల్లు కడతామని ఇచ్చిన హామీ గాలిలో కలిసిపోయిందని పేద ప్రజలు నిలదీస్తారనే భయంతోనే సామూహిక గృహప్రవేశాల పేరుతో నిర్వహించిన తూతూ మంత్రపు కార్యక్రమంలో కూడా ముఖ్యమంత్రి తమ అధినేతపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని ఉదయ్ శ్రీనివాస్ ఆరోపించారు. రాష్ట్రానికి జీవనాడి అయినా పోలవరం ప్రాజెక్టును రివర్స్ టెండరింగ్ పేరిట ఎందుకు మూల పడేలా చేశారని ప్రశ్నిస్తే, ప్రాజెక్టుకు కీలకమైన డయాఫ్రం వాల్ దెబ్బతినకుండా ఎందుకు చర్యలు తీసుకోలేదంటే, నాసిరకంగా నిర్మించి గైడ్ బండ్ ఎందుకు కుంగిపోయేలా చేశారని ప్రశ్నిస్తే, ఈ స్తోత్రమే చదివారని ఎద్దేవాచేశారు. రాష్ట్రాన్ని పది లక్షలకోట్ల రూపాయల అప్పుల్లో ఎందుకు ముంచేశారని, ఇసుక దోపిడీ విధానాలతో భవన నిర్మాణ కార్మికులు ఆకలి బాధలతో ఆత్మహత్యలకు పాల్పడేలా చేశారని అడిగితే ఇదే స్తోత్రం ముఖ్యమంత్రి చదివారని ఉదయ్ శ్రీనివాస్ ధ్వజమెత్తారు. వాలంటీర్ వ్యవస్థ పేరుతో ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని రాబట్టి, రాష్ట్రంలో వేలాది మహిళల అదృశ్యం కావడానికి కారకులవుతున్నారని, ఉద్యోగులకు హామీ ఇచ్చిన సిపిఎస్ రద్దు చేయలేకపోయారని, అక్కచెల్లెమ్మల మంగళ్యాలను తెంచేస్తున్న మద్యపానాన్ని దశలవారీగా నిషేధించాకే 2024 ఎన్నికల్లో ఓట్లు అడుగుతానని పలికిన ప్రగల్బాలు ఏమయ్యాయని నిలదీస్తే ఇదే స్తోత్రం చదివారని ఉదయ్ శ్రీనివాస్ ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు లక్షలాది నిరుద్యోగులను ఆశలపల్లకిలో ఊరేగించిన ఏటా జాబ్ క్యాలెండర్ ఏమయ్యిందని, మెగా డీఎస్సీ ఎక్కడకు పోయిందని నిలదీస్తే మళ్లీ ఇదే స్తోత్రం చదువుతున్నారన్నారు. రైతన్నలకు కనీసం మద్దతు ధర ఇవ్వాలని, తడిసిన ధాన్యం కొనాలని, మిల్లర్లు మోసాలు ఆపాలని, సకాలంలో నీరు అందించి క్రాప్ హాలిడేలు ప్రకటించకుండా ఆపాలని, కౌలు రైతుల ఆత్మహత్యలు ఆపాలని, చనిపోయిన రైతు కుటుంబాలను ఆదుకోవాలని కోరితే మళ్లీ ముఖ్యమంత్రి అదే పాట పాడుతున్నారని ఉదయ్ శ్రీనివాస్ ధ్వజమెత్తారు. 31 మంది ఎంపీలతో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎందుకు సాధించలేకపోయారని, విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణకను ఆపలేకపోతున్నారని, విశాఖ రైల్వే జోన్ సాధించలేకపోతున్నారని, కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించలేకపోతున్నారని ప్రశ్నిస్తే అదే పాట పాడుతున్నారన్నారు. చివరకు రాష్ట్రంలో ధ్వంసమైన రోడ్లపై తట్ట మట్టి వేయాలని పట్టుబట్టినా, అడ్డంగా దోచేసిన పంచాయితీ నిధులు తిరిగివ్వాలని అడిగినా, ఋషికొండ విధ్వంసాన్ని నిలువరించాలని కోరినా మూడు పెళ్లిళ్ల స్తోత్రం చదువుతున్నారని ఉదయ్ శ్రీనివాస్ ధ్వజమెత్తారు. ఇప్పటికే ముఖ్యమంత్రి తీరును అసహ్యించుకుంటున్న రాష్ట్ర ప్రజానీకంగా రానున్న ఎన్నికల్లో బుద్ది చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ఉదయ్ శ్రీనివాస్ స్పష్టంచేశారు.