ముఖ్యమంత్రి పర్యటన వరద బాధితుల్లో భరోసా నింపలేదు

* డ్రామా కంపెనీ వ్యవహారంలా వైసీపీ హడావిడి
* ఎంపిక చేసిన వారితోనే సీఎం మాటామంతి
* వినతి పత్రాలు కూడా తీసుకోలేని స్థితిలో ఉన్నారు
* వినతి పత్రం ఇస్తామంటే జనసేన నేతలను హౌస్ అరెస్టులు చేశారు
* బాధిత కుటుంబాలకు రూ.10 వేలు తక్షణసాయం అందించాలి

గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి గారు జరిపిన పర్యటన బాధితుల్లో కనీస భరోసా నింపలేక పోయిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటనలో విమర్శించారు. ఏదో డ్రామా కంపెనీ కార్యక్రమం జరిగినట్లు అనిపించింది. వైసీపీ సానుభూతిపరులను కొంతమందిని ఎంపిక చేసి వాళ్లకు ఐ.డి. కార్డులు ఇచ్చి ముఖ్యమంత్రి ముందు నిలబెట్టారు. ప్రభుత్వ సాయం అద్భుతం, చాలా గొప్పగా ఆదుకున్నారని వాళ్లతో చెప్పించడానికి వైసీపీ నేతలు, అధికారులు పడ్డ తిప్పలు అన్నీఇన్నీ కావు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పని తీరు తెలుసుకోవాలంటే నిజమైన బాధితులు ఇద్దరిని పిలుపించుకొని మాట్లాడినా చాలు.. ముఖ్యమంత్రికే పరిస్థితి అర్ధమవుతుంది.
* విపక్షాలపై విమర్శలకే వరద పరామర్శ
గోదావరి వరదల వల్ల ఆరు జిల్లాలు… 54 మండలాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. సామాన్యులు, రైతులు తీవ్రంగా నష్టపోయారు. వరద ప్రాంతాల్లో చిన్న పిల్లలు పాలు లేక యాతన అనుభవించారు. వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. వారం రోజులుగా పశుగ్రాసం లేక పశువులు ఆకలితో అలమటిస్తే… ప్రభుత్వం చేసిన సహాయం చూసి నోరు లేని పశువులు కూడా ఆనందిస్తాయని ముఖ్యమంత్రి గారు మాట్లాడం చాలా హాస్యాస్పదం. క్షేత్రస్థాయిలో వేలాది కుటుంబాలు ఇబ్బందులు పడుతుంటే జిల్లా అధికార యంత్రాంగం ఏమైపోయింది? ఎంతమందికి ఆర్థిక సాయం అందించింది? ఎన్ని కుటుంబాలను ఆదుకుంది? ఈ విషయాలను గురించి ప్రస్తావించకుండా ముఖ్యమంత్రి గారు ఇతరులను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పర్యటించినప్పుడు బాధితులకు సాయం అందింది అనే భావన ఎక్కడా కలగలేదు.
* సాయం చేస్తే నిర్బందిస్తారా?
వరద బాధితుల కష్టాలు, ప్రభుత్వం అందిస్తున్న సాయంపై ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేష్ నాయకత్వంలో జిల్లా నాయకులు అంతా ముఖ్యమంత్రి గారిని కలిసి వినతిపత్రం అందించాలని ప్రయత్నిస్తే వాళ్లను బలవంతంగా హౌస్ అరెస్టులు చేశారు. వరద బాధిత కుటుంబాలకు రూ. 10 వేలు తక్షణ సాయం అందేలా చూడాలని ఒక వైసీపీ ప్రజా ప్రతినిధిని మా పార్టీ వీర మహిళలు కోరితే… వారిని అవమానించేలా మాట్లాడటం బాధాకరం. ఈ పోకడలను ఖండిస్తున్నాం. పొరుగు రాష్ట్రాల్లో వరద బాధితులకు రూ. 10 వేలు తక్షణ పరిహారం అందిస్తుంటే ఇక్కడ మాత్రం రూ 2 వేలు ఇవ్వడం దుర్మార్గం. ఇతర రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో ఎక్కువ నష్టం జరిగింది. వేలాది ఇళ్లు, లక్షలాది ఎకరాలు నీట మునిగాయి. వరద బాధితులతో పునరావాస కేంద్రాలు నిండిపోయాయి. వరద బాధితులకు అండగా ఉండి, మీకు తోచిన సాయం మీరు అందించాలని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మా నాయకులు క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితులకు కనీస అవసరాలు తీరుస్తుంటే వాళ్లను నిర్భందించడం సిగ్గుచేటు. కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా ఉండాలని జనసేన పార్టీ ప్రయత్నిస్తుంది తప్ప ఏనాడు ఓట్ల కోసం స్వార్ధ రాజకీయాలకు పాల్పడదు.
* ముఖ్యమంత్రి వస్తారు.. వెళ్తారు అన్న భావన ప్రజల్లో ఉంది
వరద నష్టంపై ఇతర రాష్ట్రాల్లో అధికారులు ప్రాథమిక అంచనా వేసి కేంద్రానికి నివేదిక సమర్పించి తక్షణ సాయం కోరుతుంటే… మన రాష్ట్రంలో మాత్రం ఇంకా ప్రమాద హెచ్చరికలు ఉన్నాయి అందుకే వరద నష్టంపై ప్రాథమిక అంచనా వేయలేదని ముఖ్యమంత్రి మాట్లాడటం సిగ్గుచేటు. గతంలో ఎన్నడూ ఇలా జరగలేదు. వరదలు రాగానే రెవెన్యూ అధికారులు నష్టంపై ప్రాథమిక అంచనా వేసి, ఆ నివేదికను కేంద్రానికి పంపించాలి. కేంద్రం నుంచి ప్రత్యేక బృందం రాష్ట్రంలో పర్యటించి నష్టంపై అంచనా వేసి అందుకు అనుగుణంగా కేంద్రం నుంచి నిధులు విడుదల అయ్యేవి. కానీ ఈ ప్రభుత్వం తూతూ మంత్రంగా పనిచేస్తోంది. ముఖ్యమంత్రి ఇలానే పనిచేస్తాడు. వరదలు వచ్చిన వారానికి వస్తాడు… వెళ్తాడు అనే భావన ప్రజల్లో ఉంది. ప్రతిపక్షాల నుంచి వినతిపత్రం కూడా తీసుకోలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఒక రాజకీయ పార్టీగా క్షేత్రస్థాయి పరిస్థితిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం. వరద బాధితులకు తక్షణ సాయం కింద రూ. 10 వేలు అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం అని శ్రీ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.