- విద్యుత్ చార్జీలను ప్రభుత్వం పెంచలేదు – ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, పులివర్తి నానీల
తిరుపతిలో ఎస్పీడిసీఎల్ టౌన్, రూరల్ డివిజన్ ల నూతన భవన సముదాయాన్ని ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, పులివర్తి నానీలు సోమవారం ఉదయం ప్రారంభించారు. తిరుచానూరు రోడ్డులోని పాత భవనం ఆవరణంలోనే నూతన భవనాన్ని 2.8కోట్లతో నిర్మించారు. ఈ భవనంలో తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు లోని కొన్ని ప్రాంతాల అధికారులు విధులు నిర్వహించనున్నారు. తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి ఉమ్మడిగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. ముఖ్యంగా తిరుపతి, రూరల్ ప్రాంతం ట్విన్ సిటీస్ తరహాలో అభివృద్ధి చెందుతున్నాయన్నారు. తిరుపతి పరిసర ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయలు లేకుండా అందించాలంటే కొత్త విద్యుత్ స్టేషన్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల నుంచి విద్యుత్ కు సంబంధించిన ఫిర్యాదులు వచ్చిన వెంటనే పరిష్కరించాలని వారు అధికారులను ఆదేశించారు. కాగా రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయినా విద్యుత్ ఛార్జీలను ఎన్డీఏ ప్రభుత్వం పెంచ లేదని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానీ స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ లు విద్యుత్ చార్జీలను పెంచలేదన్నారు. గతంలో ఆరు నెలలకు ఒకసారి విద్యుత్ చార్జీలు పెరిగేవన్నారు. సోలార్ విద్యుత్ వినియోగం పెంపుదలకు ప్రజలు పిఎం సూర్యఘర్ పథకాన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యేలు కోరారు. అంతరాయాలు లేని విద్యుత్ ను అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఎస్ ఈ సురేంద్ర బాబు మాట్లాడుతూ 24 గంటలు ప్రజల సేవలో ఉద్యోగులు ఈ నూతన భవనం నుంచి సేవలు అందిస్తారన్నారు. స్మార్ట్ సిటీలో భాగంగా తిరుపతిలో వంద కోట్లతో అండర్ గ్రౌండ్ లో విద్యుత్ కేబుల్స్ వేసినట్లు ఆయన తెలిపారు. రుయా ఆస్పత్రి ఆవరణలో జరిగిన అగ్నిప్రమాదంలో విద్యుత్ శాఖకు 20 లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్లు ఆయన తెలిపారు. తిరుపతిలో ఎవరైనా కేబుల్స్ వేయాలంటే తప్పని సరిగా మున్సిపల్, విద్యత్ శాఖల నుంచి అనుమతి పొందాలని ఆయన స్పష్టం చేశారు. నగరం అందాన్ని దెబ్బతీస్తున్న కేబుల్స్ ను వెంటనే కేబుల్, ఇంటర్ నెట్ ఆపరేటర్లు తొలగించాలని ఆయన కోరారు. ఈ క్రమంలో సిజిఎం వరకుమార్, ఈఈ ఆపరేషన్ టౌన్ డివిజన్ చంద్రశేఖర్ రావు, రూరల్ ఈఈ చిన్న రెడ్డప్ప, కన్స్ట్రక్షన్ ఈఈ తిరుపతి బాలాజీ, తిరుపతి, చంద్రగిరికి చెందిన కూటమి పార్టీల నేతలు తదితరులు పాల్గొన్నారు.

Share this content:
Post Comment