కరెంటు బిల్లులు చూస్తే సామాన్యుడికి షాక్..

  • ప్రజలపై వరుసగా మోయలేని భారాలు
  • వైసీపీకి గుణపాఠం నేర్పే రోజు దగ్గరలోనే ఉంది
  • జనసేన జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మునుక్రాంత్ రెడ్డి
  • కరెంట్ చార్జీల బాదుడుకు నిరసనగా జనసేన ఆందోళన

నెల్లూరు: రాష్ట్రవ్యాప్తంగా కరెంటు బిల్లులను చూస్తే సామాన్యుడికి షాక్ తగులుతుందని జనసేన జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి పేర్కొన్నారు. కరెంట్ చార్జీల బాదుడును నిరసిస్తూ జనసేన ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ వద్ద గురువారం సాయంత్రం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో మోసపూరితమైన వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు. ప్రజలపై మోయలేని భారాలు మోపుతున్నారని విద్యుత్ బిల్లులు చూస్తే సామాన్యుడు లబోదిబోమంటూ బోరున విలపించే పరిస్థితి నెలకొందన్నారు. గడిచిన నాలుగు సంవత్సరాలలో ట్రూప్ చార్జీలు ఫ్యూయల్, సర్ చార్జీలతో పాటు అనేక రకాల చార్జీలతో బాదుడే బాదుడుగా వైసిపి ప్రభుత్వం తన అసమర్థ పాలన సాగిస్తుందని ధ్వజమెత్తారు. ఇప్పటికే నిత్యావసరా వస్తువుల ధరల పెరుగుదలతో సామాన్యుడి పరిస్థితి అగమ్య గోచరంగా ఉంటే కరెంట్ చార్జీల భారాలను మరింత మోపటం గోరుచుట్టుపై రోకటి పోటుగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు తగిన గుణపాఠం నేర్పే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు. జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు మాట్లాడుతూ.. ప్రజలు ఎన్నో ఆశలతో వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఆ ఆశలను వమ్ము చేశారన్నారు. ఓవైపు ధరల పెరుగుదల మరోవైపు కరెంటు బాదుడు, వివిధ రకాల పన్నుల భారాలతో సామాన్య మధ్యతరగతి ప్రజలు విలవిలలాడుతున్నారన్నారు. వైసిపి ప్రభుత్వానికి నూకలుచెల్లిపోయే రోజులు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి షేక్ అలియా, నగర కార్యదర్శి దాసరి మాధురి, నగర డివిజన్ ఇంచార్జులు దాసరి రమణ, అజయ్ శనివారపు, రేవంత్ వావిలా, అనుదీప్, ఉదయ్, కంధర, అలెక్, ఉదయ్, కరీం, నగర నాయకులూ రమేష్, రేణుక, పృద్వి, జీవన్ తదితరులు జనసైనికులు పాల్గొన్నారు.