మంత్రి శ్రీనివాస్ గౌడ్ నుంచి ప్రాణహాని ఉందంటూ హెచ్‌ఆర్‌సీకి దంపతుల ఫిర్యాదు

2018 ఎన్నికల సమయంలో ఓ కేసులో తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినప్పటి నుంచి తమకు వేధింపులు మొదలయ్యాయంటూ మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన విశ్వనాథరావు-పుష్పలత దంపతులు రాష్ట్ర మానవహక్కుల కమిషన్ (ఎస్‌హెచ్ఆర్‌సీ)ని ఆశ్రయించారు. శ్రీనివాస్ గౌడ్, ఆయన సోదరుడు శ్రీకాంత్ గౌడ్ నుంచి తమకు ప్రాణహాని ఉందని ఆరోపించారు. వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పామన్న కక్షతో తమపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురిచేస్తున్నారని కమిషన్‌కు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

సీఐ మహేశ్వర్‌తో అర్ధరాత్రి వేళలో ఇంటిపై దాడులు చేయిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న తమను ఉద్యోగాల్లోంచి తీసివేయించారని వాపోయారు. ఇకనైనా వేధింపులు ఆపాలని, లేకుంటే మంత్రి, ఆయన సోదరుడి పేర్లతో లేఖరాసి పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్య చేసుకుంటామని ఎస్‌హెచ్ఆర్‌సీకి ఇచ్చిన ఫిర్యాదులో హెచ్చరించారు.