మానవత్వం మరచి దళిత యువకుడిని బూటు కాలితో తన్నిన సీఐని సస్పెండ్ చేసిన డిఐజి

ప‌లాస మండ‌లం టెక్క‌లి ప‌ట్నంకు చెందిన జ‌గ‌న్ అనే యువకుడ్ని సీఐ బూటుకాలితో త‌న్నారు. పలాస పోలీస్ స్టేషన్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.

స్థానిక వైసీపీ నేతలను ఇళ్ల పట్టాల విషయంలో టెక్కలిపట్నంకు చెందిన మర్రి జగన్ అనే దళిత యువకుడు నిలదీయడంతో జగన్‌పై వైసీపీ నేతలు దాడి చేశారు. దీనితో ఆ యువకుడు తన తల్లితో వైసీపీ నేతలపై ఫిర్యాదు చేయటానికి తన తల్లితో కలిసి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. ఇలాంటి సంఘటనల్లో బాధితుడికి ధైర్యం చెప్పి కేసు నమోదు చేయాల్సిన పోలీసులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన తీరు ప్రజలకు పోలీసులపై నమ్మకం కోల్పోయేలా చేసింది. అతడి తల్లి ఎదుటే ఫిర్యాదు చేయడానికి వెళ్ళిన యువకుడిని సీఐ వేణుగోపాల్ బూటుకాలితో తన్నడంతో దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ సంఘటనపై దళిత సంఘాలు, మానవహక్కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఈ సంఘ‌ట‌నకు సంబందించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావడంతో.. ఏపీ డీజీపీ కార్యాల‌యం సీరియ‌స్‌గా తీసుకుని విచార‌ణ జ‌రిపిన తర్వాత విశాఖ డీఐజీ కాళిదాస్ రంగారావు సీఐ వేణుగోపాల‌న్‌ను స‌స్పెండ్ చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేశారు.

ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబు దళిత యువకుడిని సీఐ బూటు కాలితో తన్నిన ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో దారుణాలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ ట్వీట్ చేశారు.