తండ్రీకొడుకుల పాలనకు శుభం కార్డ్

టీఆర్‌ఎస్‌ నిరంకుశ, కుటుంబ పాలనకు చరమగీతం పాడేందుకు జీహెచ్‌ఎంసీ ప్రజలు సిద్ధంగా ఉన్నారని.. రాష్ట్రంలో తండ్రీకొడుకుల పాలన అంతం కావాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆకాంక్షించారు. గురువారం ముషీరాబాద్‌, అడ్డగుట్టలో నిర్వహించిన రోడ్‌షోలు, పార్సిగుట్టలో నిర్వహించిన బహిరంగ సభలో కిషన్‌రెడ్డి మాట్లాడారు.

కాగా, గత ఎన్నికల్లో పేద ప్రజలకు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పిన టీఆర్‌ఎస్‌.. ఐదేళ్లలో ఒక్కరికైనా ఇచ్చిందా? అని ప్రశ్నించారు. లక్ష ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీని విస్మరించిందని దుయ్యబట్టారు. వరద బాధితులకు అందజేయాల్సిన ఆర్థిక సహాయాన్ని టీఆర్‌ఎస్‌ నాయకులే జేబులో వేసుకున్నారని విమర్శించారు. కానీ, తండ్రీకొడుకుల మాటలు కోటలు దాటుతున్నాయని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో టీఆర్‌ఎ్‌సకు వ్యతిరేక పవనాలు వీస్తుండగా, బీజేపీ దూసుకెళ్తుందన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి పాలన కొనసాగుతుందని ఆరోపించారు. ఈ సందర్భంగా పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులు బీజేపీలో చేరారు. అబద్ధాలు చెప్పడంలో సీఎం కేసీఆర్‌, ఆయన తనయుడు కేటీఆర్‌ పోటీ పడుతున్నారని మంత్రి జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. దుబ్బాక ఉప ఎన్నిక ముందు కూడా శాంతిభద్రతలపై ఇలాంటి వ్యాఖ్యలే చేశారని గుర్తు చేశారు.

బీజేపీలో చేరిన స్వామిగౌడ్‌ మాట్లాడుతూ అత్తగారింట్లో తన్నులు తిని అమ్మగారి ఇంటికి వచ్చిన బిడ్డను ఆదరించినట్లుగా పార్టీ నాయకత్వం తనను ఆదరించిందని పేర్కొన్నారు. బీజేపీకి తాను కొత్తకాదని, ప్రభుత్వ ఉద్యోగంలో చేరకముందు, దివంగత నేత వాజ్‌పేయికి డ్రైవర్‌గా పని చేశానని గుర్తు చేసుకున్నారు.