తుఫాను వల్ల నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలి

• వర్షం వల్ల నియోజకవర్గం వ్యాప్తంగా పంట పూర్తిగా దెబ్బతిన్నది
• రైతుల ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది
• జరిగిన నష్టాన్ని పారదర్శకంగా అంచనా వేయాలి
• నష్టపోయిన రైతులందరికీ భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది
• రాజకీయాలకతీతంగా రైతులందరినీ ఆదుకోవాలి

  • దర్శి జనసేన నాయకుల డిమాండ్

దర్శి, మిచౌంగ్ తుఫాన్ కారణంగా దర్శి నియోజకవర్గంలో గత రెండు రోజులనుండి ఎడతెరిపిలేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న నియోజకవర్గంలోని అనేక గ్రామాలలోని పంట పొలాలను దర్శి జనసేన నాయకులు పరిశీలించారు. గ్రామాలలోని రైతులను పరామర్శించారు. దర్శి మండలంలోని చందలూరు, లింగన్నపాలెం గ్రామాలను దర్శి పట్టణ కమిటీ అధ్యక్షుడు చాతిరాశి కొండయ్య, ముండ్లమూరు మండల కమిటీ అధ్యక్షులు తోట రామారావు, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు పసుపులేటి చిరంజీవి, నియోజకవర్గ సీనియర్ నాయకులు పుప్పాల పాపారావులు సందర్శించారు. రైతులు బొటుకు శేషయ్య, శెట్టినేని లింగారావ్, లింగాల చెన్నయ్య, శింగంశెట్టి చిన్న వెంకటేశ్వర్లు, శెట్టినేని ఈశ్వరరావు, నంద్యాల రంగారావు, కొట్టే మల్లిఖార్జున, నంద్యాల పెద్ద అంజయ్య, సుంకర గురుస్వామి, సుంకర ఎల్లారావు తదితర రైతులను అడిగి నష్టాన్ని అంచనా వేయడానికి ప్రయత్నించారు. తదనంతరం జనసేన నాయకులు మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని, వేలాది ఎకరాలలో మిర్చి, పొగాకు లాంటి అన్ని రకాల పంటలు దెబ్బతినడం జరిగిందని, కోతకు వచ్చిన పంట చేతికందకుండా పోయిందని రైతులు కన్నీళ్లతో వాపోవడం ఎంతో బాధ కలిగించిందని, భారీ స్థాయిలో నష్టం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తుందని అన్నారు. ప్రభుత్వ అధికారులు నిష్పక్షపాతంగా జరిగిన నష్టాన్ని అంచనావేయాలని అన్నారు. సంవత్సరకాలంగా రేయనక, పగలనకా కష్టపడి దుక్కిదున్ని, పైరువేసి, కలుపులు తీసి, ఎరువులకు అప్పులు చేసి పండించిన పంట అకాల వర్షాల కారణంగా దెబ్బతినడం చూస్తే ఎంతో దుఃఖం కలుగుతుందని, ఆర్థిక ఇబ్బందులతో ఎంతో అవస్థపడుతున్న మన అన్నదాతలను తగిన రీతిలో ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. వారిలో మానసిక స్థైర్యాన్ని నింపాల్సివుందని, ఆర్థికంగా వారిని సముచితంగా ఆదుకొని వారికి, వారి కుటుంబాలకు భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన రైతులందరినీ రాజకీయాలకతీతంగా ఆదుకోవాలని, వారికి భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు.