వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి ప్రాణవాయువుతో బయలుదేరిన తొలి ‘ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్’

దేశంలో కరోనా వైరస్ రెండో దశ ఉద్ధృతమైన నేపథ్యంలో సరిపడా ఆక్సిజన్ అందక కరోనా రోగులు మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆక్సిజన్‌కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఇక కరోనా వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న మహారాష్ట్రలో ఆక్సిజన్ అవసరం మరింత ఎక్కువగా ఉంది. దీంతో విశాఖపట్టణం నుంచి తొలి ‘ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైలు’ గత రాత్రి మహారాష్ట్రకు బయలుదేరింది. ఈ రైలు త్వరితగతిన గమ్యానికి చేరేలా అధికారులు గ్రీన్ కారిడార్ ను ఏర్పాటు చేశారు.

సోమవారం రాత్రి కలంబోలి నుంచి ఏడు ఖాళీ ఆక్సిజన్ ట్యాంకర్లతో బయలుదేరిన రైలు రెండు రోజులు ప్రయాణించి నిన్న తెల్లవారుజామున వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు చేరుకుంది. అక్కడి సిబ్బంది ట్యాంకర్లను కిందికి దించి వాటిలో ఆక్సిజన్ నింపి తిరిగి రైలుపైకి ఎక్కించారు. ఈ మొత్తం కార్యక్రమాన్ని ఓ యజ్ఞంలా నిర్వహించారు. మొత్తం ఏడు ట్యాంకర్లలోనూ 103 టన్నుల మెడికల్ ఆక్సిజన్‌ను నింపారు. అనంతరం రైలు మళ్లీ మహారాష్ట్రకు బయలుదేరింది. ప్రాణవాయువును మోసుకుని రైలు బయలుదేరిన వెంటనే కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఈ విషయాన్ని ట్వీట్ చేశారు.