రాక్షస పాలన అంతానికి తొలిఅడుగు పడింది

  • వైసీపీ అరాచక పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఆకాశాన్నంటింది
  • ప్రజలు వైసీపీ పాలన నుంచి విముక్తి కోరుకుంటున్నారు
  • నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన పెమ్మసాని చంద్రశేఖర్.. గళ్లా మాధవి

గుంటూరు: ఐదేళ్లుగా రాష్ట్రంలో జరుగుతున్న రాక్షస పాలనను అంతం చేసేందుకు వేలాదిమంది ప్రజలు తొలి అడుగువేస్తూ కదం తొక్కటం శుభపరిణామమని గుంటూరు పార్లమెంట్ ఉమ్మడి కూటమి టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు రాజకీయ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో సోమవారం జరిగిన కూటమి ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, అసెంబ్లీ పశ్చిమ, తూర్పు అభ్యర్థులు గళ్లా మాధవి, నసీర్ అహ్మద్ ల నామినేషన్ కార్యక్రమం విజయవంతం అయిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అభ్యర్థులు పెమ్మసాని చంద్రశేఖర్, గళ్లా మాధవిలకు స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ వైసీపీ దుర్మార్గపు పాలనపై ప్రజల్లో ఎంతటి ఆగ్రహావేశాలు నెలకొన్నాయో నామినేషన్ కార్యక్రమం ద్వారా తేటతెల్లమైందన్నారు. వైసీపీ పాలనను ప్రజలు ఇక భరించే స్థితిలో లేరంటూ పేర్కొన్నారు. ఇక అతికొద్ది రోజుల్లోనే రాష్ట్ర రాజకీయాల్లో నవశఖం ప్రారంభమవుతుందని పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి గళ్లా మాధవి మాట్లాడుతూ ఎర్రటి ఎండను సైతం లెక్కచేయకుండా తమకు మద్దతు తెలిపేందుకు తమ వెంట నడుస్తూ ఆశీస్సులు అందచేసిన ప్రజలకు తన జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. రాజకీయాల్లో అవినీతిని, అక్రమ సంపాదనకు అరికట్టాల్సిన అవసరముందన్నారు. ఇందుకు ప్రజలు విజ్ఞతతో ఆలోచించి జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థులకు ఆశీస్సులు అందించాలని మాధవి కోరారు. కార్యక్రమంలో ఉగ్గిరాల సీతారామయ్య, నిమ్మల శేషయ్య, తాళ్ళ వెంకటేష్, ముజీబ్, దారం అనిత, శ్రీరామ్ ప్రసాద్, రుస్తుం బాబు, వీరయ్య తదితరులు పాల్గొన్నారు.