వైభవంగా శ్రీ సంగమేశ్వర శివాలయ ధ్వజస్తంభ ప్రతిష్ఠ

*విశిష్ట అతిథిగా హాజరైన డా. వంపూరు గంగులయ్య

అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు నియోజకవర్గంలోని సంగోడి గ్రామంలో వెలసిన శ్రీశ్రీశ్రీ సంగమేశ్వర శివాలయంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవం శనివారం నాడు అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి బ్రహ్మ కుమారిస్ (ఓం శాంతి) సంస్థ మరియు గ్రామస్తుల ఆహ్వానం మేరకు జనసేన పార్టీ పాడేరు అసెంబ్లీ మరియు అరకు పార్లమెంట్ ఇంచార్జ్ డా. వంపూరు గంగులయ్య విశిష్ట అతిథిగా హాజరై, కుటుంబ సభ్యులతో పాటు ఆలయాన్ని దర్శించుకున్నారు. ప్రారంభంలో డా. గంగులయ్యని గిరిజన సంప్రదాయ రీతిలో ఘనంగా స్వాగతించారు. అనంతరం ఆలయంలో వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక హోమాలు, పూజలు నిర్వహించగా, ధ్వజస్తంభ ప్రతిష్ఠ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ డా. వంపూరు గంగులయ్య, “ఇలాంటి మహోన్నతమైన ఆధ్యాత్మిక కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడాన్ని నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. గ్రామస్తులు శ్రద్ధతో ఆలయ అభివృద్ధికి కృషి చేయాలి. శ్రీ సంగమేశ్వర స్వామి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై, గిరిజన ప్రాంత ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలి” అని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ మండల నాయకులు మాదేల నాగేశ్వరరావు, మజ్జి సంతోష్, బ్రహ్మ కుమారిస్ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment