వైసీపీ నేతల ఉన్మాదం పరాకాష్టకు చేరింది

  • ఓటమి భయంతో వికృతంగా ప్రవర్తిస్తున్నారు
  • ప్రతిపక్ష నేతల బొమ్మల్ని కొట్టించి పైశాచిక ఆనందం పొందుతున్నారు
  • కన్నా లక్ష్మీనారాయణపై రాళ్ళ దాడి దుర్మార్గం
  • సిద్ధం అంటూ సీఎం సమరశంఖం పూరించింది ఇలాంటి డాడులకేనా?
  • ప్రజలు వైసీపీ పై ఓట్లతో దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారు
  • వైసీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆళ్ళ హరి

గుంటూరు, రానున్న ఎన్నికల్లో పరాజయం తప్పదని నిర్దారించుకున్న వైసీపీ నేతలు పైశాచికత్వం నిండిన పిశాచాల్లా ప్రవర్తిస్తున్నారని , ప్రతిపక్ష నేతలపై దాడులకు తెగబడటంతో వారి ఉన్మాదం పరాకాష్టకు చేరిందని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి విమర్శించారు. పవన్ కల్యాణ్, చంద్రబాబుల బొమ్మల పెట్టి వాటిముందు బాక్సింగ్ బ్యాగ్స్ పెట్టి పిడిగుద్దులు గుద్ధించటంపై ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికలు దగ్గరయ్యే కొద్దీ వైసీపీ నేతల వికృత చేష్టలు ఒక్కొక్కటి బయటికి వస్తున్నాయని విమర్శించారు. అరాచక, అవినీతి, అసమర్ధ పాలనతో, దోపిడీలతో, దాష్టీకాలతో వైసీపీ ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందన్నారు. దీంతో ఓటమి కళ్ళముందే కదలాడుతుండటంతో ముఖ్యమంత్రి నుంచి కిందిస్థాయి నాయకుల వరకు విపరీత పోకడలు పోతున్నారని దుయ్యబట్టారు. మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణపై సత్తెనపల్లిలో రాళ్లతో దాడి చేయటం పిరికిపంద చర్య అన్నారు. జనసేన-టీడీపీల దెబ్బకి సత్తెనపల్లిలో వైసీపీ ఖాళీ అయిపోయిందన్నారు. దీంతో అంబటికి దిక్కుతోచక భౌతిక దాడులకు ఉసిగొల్పుతున్నారని ధ్వజమెత్తారు. సిద్ధం అంటూ జగన్ రెడ్డి సమరశంఖం పూరించింది ఇలాంటి దాడుల చేయమనా అంటూ నిలదీశారు. రానున్న ఎన్నికల్లో ఓటమి నుంచి వైసీపీని ఏ శక్తీ కాపాడలేదన్నారు. వైసీపీపై ప్రజలు ఓట్లతో దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఆళ్ళ హరి అన్నారు.