రజినీకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ ప్రకటించిన ప్రభుత్వం

తమిళ స్టార్ హీరో రజినీకాంత్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. రజినీకాంత్ సినిమా వస్తుందంటే తమిళనాట పండగ వాతావరణం నెలకొంటుంది. ఆయన నటించే చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులను క్రియేట్ చేశాయి. అయితే తాజాగా రజినీకాంత్‌కు ఓ విశిష్ట గౌరవం దక్కింది. భారత ప్రభుత్వం ప్రతియేటా అందించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును 2020వ సంవత్సరానికి గాను రజినీకాంత్ గెలుపొందారు.

తమిళ సినిమాతో పాటు తెలుగు, హిందీ వంటి పలు భాషల్లో నటించిన రజినీకాంత్, యావత్ దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. సినీ రంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తుగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్‌ను రజినీకి ప్రకటించింది. దీంతో రజినీకాంత్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తలైవాకు ఈ అవార్డ్ ఎప్పుడో రావాల్సిందని, ఇప్పటికైనా ఈ అవార్డును ప్రభుత్వం ప్రకటించడం సంతోషంగా ఉందని వారు అంటున్నారు. 51వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును రజినీకాంత్‌కు అందిస్తున్నట్లు కేంద్ర మంత్రి జవదేకర్ ప్రకాష్ ప్రకటించారు.

కాగా ఇటీవల బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌కు ఈ అవార్డు దక్కిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తమిళ నటుడు రజినీకాంత్‌కు కూడా ఈ అవార్డు రావడంతో సినీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇక రజినీకాంత్ ఇప్పటికే భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ వంటి అవార్డులు అందుకున్న సంగతి తెలిసిందే. అటు సినిమాల పరంగా రజినీకాంత్ ప్రస్తుతం అన్నాతై అనే సినిమాలో నటిస్తున్నాడు.