Repalle: వాయిగుండాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

రేపల్లె నియోజకవర్గం వరస వాయుగుండాలతో అధిక వర్షాల వలన విపరీతమైన గాలులు వేయడం వలన పంటకు వచ్చిన వరి నేలకొరిగిందనీ, రైతాంగం ఎంతో నష్టపోయారని, తుఫాన్ల వలన నీటిలో పడిపోయి వరిగింజలు మొలకెత్తుతున్నాయని ఈ పరిస్థితిని రైతులు తట్టుకోలేకుండా ఉన్నారని జనసేనపార్టీ రేపల్లె నియోజకవర్గ ఇన్ఛార్జ్ కమతం సాంబశివరావు, జనసేనపార్టీ గుంటూరు జిల్లా ప్రధానకార్యదర్శి కమతం విజయకుమారి అన్నారు. ఆదివారం రేపల్లె, పేటేరు, పెనుమూడి ప్రాంతాల రైతులతో కలిసి దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించారు.

ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు నోటిదాకా వచ్చే సమయాన రైతులు ప్రతి సంవత్సరం ఇలాగే నష్టపోతున్నారని అన్నారు. సొంతంగా సాగుచేస్తున్న రైతులు, నష్టపోయిన కౌలు రైతులకు ఒక ఎకరానికి రూ.10,000/- తక్షణ సాయం అందించాలని, మెట్ట ప్రాంతాలలో కంద, పెండలం, పసుపు, అరటి, నిమ్మ, కూరగాయలు తదితర వాణిజ్య పంటలు పాక్షికంగా దెబ్బతిన్నాయని, దెబ్బతిన్న ఒక ఎకరానికి రూ.5000/- తక్షణ సాయం అందించాలని జనసేన పార్టీ నాయకులు కమతం సాంబశివరావు, కమతం విజయకుమారి కోరారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా నష్టపోయిన రైతులకు ఆర్ధిక సహాయం అందించాలని కోరారు. ప్రతి సంవత్సరం రైతులు నష్టపోకుండా ప్రత్యామ్నాయ విధానాలను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రూపొందించి రైతులను ఆదుకోవాలన్నారు.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పంటపొలాలు నీటమునిగి పడిపోవటం వలన రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారని, ఇప్పటికే ఒక ఎకరానికి రూ.25,000/- దాకా పెట్టుబడి పెట్టారని, పడిపోయి తడిచిపోయిన వారిని కోసి, కుప్పవేసి నూర్చాలంటే ఇంకోక రూ.25,000/- దాకా ఖర్చు అవుతుందనీ అయినా ధాన్యం పనికిరాదని రైతులు గోడు వెల్లబుచ్చారని అన్నారు. ఈ బాధతో రేపల్లె ప్రాంత పొలాలలో కోటపాటి రమేష్, బొలిశెట్టి మోహన్ అనే రైతులు ట్రాక్టర్తో మునిగిపోయిన తమ వరి పంటలను తొక్కించేశారని అన్నారు. ఈ బాధ వర్ణాతీతమని ప్రభుత్వం కనికరించి వెంటనే స్పందించాలని కోరారు.

వరస తుఫానులతో దెబ్బతిన్న పొలాలను వ్యవసాయ అధికారులతో అంచనా వేయించి రైతులకు వివక్షత లేకుండా ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని కోరారు. రేపల్లె నియోజకవర్గంలోని రేపల్లె మండలం, నగరం మండలం, నిజాంపట్నం, చెరుకుపల్లి మండలాల్లో అధిక వర్షాల వలన వేలాది ఎకరాలలో వరికి నష్టం సంభవించిందని అన్నారు. ఇంకా వర్షాలు తగ్గుముఖం పట్టలేదని వర్షం వలన చలిగాలులు కూడా పెరిగి రైతులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ నాయకులు కందుల బ్రహ్మచింతరాజు, తోట వెంకట్రావు, కమతం బ్రహ్మారావు, యర్రంశెట్టి పూర్ణ, దండా నాగేశ్వరరావు, దండా శివకృష్ణమూర్తి, బర్మా శ్రీనివాసరావు, రైతులు గొట్టిముక్కల సాంబశివరావు, కోటపాటి రమేష్, సజ్జా వెంకటసుబ్బారావు, అల్లపర్తి నాగవేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.