సోనూ అంకుల్‌నే కొడతావా అంటూ.. టీవీ ని పగలగొట్టిన బుడతడు..!

ప్రపంచాన్ని కరోనా కుదిపేసిన వేళ… ఆదుకునేవారు లేక ఎంతోమంది ఆవేదన చెందారు. అలాంటి సమయంలో హీరో సోనూసూద్‌ మానవత్వంతో ముందుకొచ్చి నేనున్నానంటూ.. ఆపన్నహస్తాన్ని అందించారు. ఎంతోమంది హృదయాల్లో సోనూసూద్‌ చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు. సోనూసూద్‌పై అభిమానం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఈ బుడతడు చేసిన పనే సాక్ష్యం….

న్యాల్‌కల్‌లోని ఎస్సీ కాలనీకి చెందిన పుష్పలతా సిహెచ్‌ ప్రణరుకుమార్‌ల కుమారుడు విరాట్‌ హుజూర్‌నగర్‌లోని శ్రీచైతన్య స్కూల్‌లో 3 వ తరగతి చదువుతున్నాడు. కరోనా కారణంగా పాఠశాలలు మూతపడటంతో ఇటీవల న్యాల్‌కల్‌కు వచ్చారు. సోమవారం రాత్రి ఇంట్లో మరదలు అద్విన్‌తో కలిసి విరాట్‌, టీవీలో దూకుడు సినిమా చూస్తున్నాడు. ఈ క్రమంలో హీరో మహేశ్‌బాబుకు విలన్‌ సోనూసూద్‌కు మధ్య ఫైటింగ్‌ సీన్‌ జరుగుతుంది. సోనూసూద్‌ను కొట్టడాన్ని చూసిన బుడతడు విరాట్‌కు తీవ్ర కోపం వచ్చింది. కరోనా టైంలో ఎంతో మందిని ఆదుకున్న సోనూసూద్‌ అంకుల్‌ని కొడతావా ? అంటూ వెంటనే బయటకు వెళ్లి ఓ రాయి తెచ్చి టీవీపై విసిరికొట్టాడు. దీంతో ఆ టీవీ పగిలిపోయింది. పక్కనే సినిమా చూస్తున్న మరదలు అద్విన్‌ టీవీని పగులగొడతావా ? ఇంకో టీవీ తీసుకురా… అంటూ ఏడ్చింది. టీవీ ని ఎందుకు పగలగొట్టావురా ? అని కుటుంబ సభ్యులంతా విరాట్‌ను నిలదీశారు. అందరికీ సాయం చేస్తున్న సోనూసూద్‌ అంకుల్‌ను వేరే వాళ్లు కొడుతుంటే కోపం వచ్చి రాయితో కొట్టాను అంటూ సమాధానం ఇచ్చాడు. దీంతో కుటుంబ సభ్యులంతా అవాక్కయ్యారు. ఈ విషయం కాస్తా అందరికి తెలియడంతో వైరల్‌గా మారింది. విరాట్‌ టీవీ పగలగొట్టిన ఘటన చివరికి సోనూసూద్‌ను చేరడంతో ట్విటర్‌లో సోనూసూద్‌ స్పందించారు. ‘అరేయ్.. మీ టీవీ పగలగొట్టకు.. మళ్లీ మీ నాన్న నన్ను కొత్త టీవీ కొనాలని అడుగుతాడు’ అంటూ సోనూసూద్‌ ట్వీట్‌ చేశారు.