రాష్ట్రంలో జాతీయ విద్యావిధానం అమలు: మంత్రి సురేష్‌

ఎపిలో జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. ఈ విధానం అమలుతో పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి వస్తుందన్నారు. అనంతపురం ఒటిఆర్‌ఐ ప్రాంగణంలో రూ.22 కోట్లతో నిర్మిస్తున్న ఫార్మసీ కళాశాల, వసతి గృహాల నిర్మాణానికి మంగళవారం మంత్రి భూమి పూజ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. విద్యాశాఖలో 2 వేల బ్యాక్‌లాగ్‌ పోస్టులను భర్తీ చేసినట్లు చెప్పారు. ఆన్‌లైన్‌ విద్యాబోధనకు రెండు వర్సిటీలను ఎంపిక చేశామన్నారు. విద్యాదీవెన పథకంలో భాగంగా రాష్ట్రంలో 35 లక్షల మంది విద్యార్థులు ల్యాప్‌టాప్‌లు కావాలని కోరినట్లు తెలిపారు. ప్రైవేట్‌ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు అన్ని చర్యలూ తీసుకున్నట్టు చెప్పారు. విద్యార్థుల తల్లిదండ్రులకు భారం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వం ప్రకాశం జిల్లాలో టంగుటూరి ప్రకాశం పంతులు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసి విసిని నియమించలేదని, రాష్ట్ర కేబినెట్‌ ఆమోదంతో ఆంధ్రకేసరి యూనివర్సిటీగా పేరు మార్చి రూ.300 కోట్ల బడ్జెట్‌ కేటాయించామని పేర్కొన్నారు.