కార్మికుల గొంతుకై జనసేన నినదిస్తుంది

  • జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి

గుంటూరు: పారిశుద్ధ్య కార్మికులు, ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఒప్పంద ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికై చేస్తున్న పోరాటానికి జనసేన పార్టీ వెన్నుదన్నుగా నిలుస్తుందని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. డిమాండ్ల పరిష్కారానికై సాగే ఉద్యమంలో కార్మికుల గొంతుకై జనసేన పార్టీ నినదిస్తుందన్నారు. మున్సిపల్ కార్మికుల సమ్మె 13వ రోజుకు చేరుకున్న నేపధ్యంలో సోమవారం నగరపాలక సంస్థ నుంచి కలక్టరేట్ వరకు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో కార్మిక సంఘాలకు మద్దతుగా జనసేన, టీడీపీ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల ఉసురు పోసుకోవటం ముఖ్యమంత్రికి మంచిది కాదన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చమంటే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి శివాలెత్తిపోతున్నాడని మండిపడ్డారు. కార్మిక సంఘ జే ఏ సీ సభ్యులు సోమి శంకరరావు మాట్లాడుతూ కరోనా లాంటి విపత్కర సమయంలో సైతం ప్రాణాలకు తెగించి పోరాడిన పారిశుద్ధ్య కార్మికులపై ప్రభుత్వం చిన్నచూపు చూడటం శోచనీయమన్నారు. ప్రభుత్వం ఇచ్చే చాలీచాలని జీతంతో కార్మికుల కుటుంబాలు కొన్నిసార్లు పస్తులుండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించే క్రమంలో ఎంతోమంది కార్మికులు అనారోగ్యం పాలవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి కార్మికుల కష్టానికి తగ్గట్టు ప్రతిఫలాన్ని అందించాలని కోరారు. రెల్లి యువ నేత సోమి ఉదయ్ కుమార్, జనసేన నాయకులు గడ్డం రోశయ్య, సయ్యద్ షర్ఫుద్దీన్, టీ యన్ టీ యు సీ రాష్ట్ర నాయకులు నారా జోషి, మదమంచి జోషి, కాకర్ల విజయ్ తదితరులు పాల్గొన్నారు.