ఎయిరిండియా వన్ లో తిరుమలకు రాష్ట్రపతి దంపతుల తొలి ప్రయాణం

దేశంలో రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధానమంత్రి వంటి అత్యంత ప్రముఖుల అధికారిక పర్యటనల కోసం ఉద్దేశించిన ఎయిరిండియా వన్-బీ777 తన గగన విహారాన్ని ఆరంభించింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఆయన భార్య సవితా కోవింద్ తొలి ప్రయాణం ప్రారంభించారు. ఈ కొత్త ఎయిర్ క్రాఫ్ట్‌లో వారు తిరుపతికి చేరుకోబోతున్నారు. ఎయిరిండియా వన్‌లో తమ తొలి ప్రయాణాన్ని ఆరంభించడానికి ముందు రాష్ట్రపతి దంపతులు.. ఈ విమానానికి పూజలు చేశారు. 10:30 గంటలకు ఈ ఎయిర్ క్రాఫ్ట్.. రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనుంది.

విమానాశ్రయం నుంచి నేరుగా రాష్ట్రపతి దంపతులు తిరుచానూరుకు చేరుకుంటారు. పద్మావతి అమ్మవారిని దర్శిస్తారు. సుమారు గంటపాటు అక్కడే గడుపుతారు. మధ్యాహ్నం 12.15 నిమిషాలకు తిరుమలకు చేరుకుంటారు. అక్కడి పద్మావతి అతిధి గృహంలో విశ్రాంతి తీసుకుంటారు. ఒంటిగంటకు వరాహ స్వామి దర్శిస్తారు. అనంతరం శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శిస్తారు. 50 నిమిషాల పాటు వారు ఆలయ ప్రాంగణంలో గడుపుతారు. 1:55 నిమిషాలకు పద్మావతి అతిధి గృహానికి చేరుకుంటారు.

విశ్రాంతి అనంతరం సాయంత్రం 4.50 నిమిషాలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి చెన్నైకి బయలుదేరి వెళ్తారు. అమెరికా అధ్యక్షుడు వినియోగించే ‘ఎయిర్‌ఫోర్స్ వన్’ తరహాలో ఎయిరిండియా వన్‌ను అనేక ప్రత్యేకతలతో రూపొందించారు. ఇలాంటి రెండు బీ777 విమానాలను ఎయిరిండియా కొనుగోలు చేసింది. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధానమంత్రి వంటి అత్యంత ప్రముఖుల అధికారిక పర్యటనల కోసం వాటిని వినియోగిస్తారు.

ఈ రెండు విమానాల కోసం ఎయిరిండియా 190 మిలియన్ డాలర్లను ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఎయిర్ ఫోర్స్ వన్‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా అత్యంత ఆధునిక సౌకర్యాలను కలిగిన ఎయిరిండియా వన్ ఎయిర్ క్రాఫ్ట్.. ఏకధాటిగా 17 గంటల పాటు ప్రయాణించగలదు. క్షిపణి దాడుల నుంచి తనను తాను రక్షించుకునే సెల్ప్ ప్రొటెక్షన్ వ్యవస్థను ఈ ఎయిర్ క్రాఫ్ట్‌కు అమర్చారు. లార్జ్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇన్‌ఫ్రార్డ్ కౌంటర్‌మెజర్స్ క్షిపణి రక్షణ వ్యవస్థలు ఇందులో అందుబాటులో ఉన్నాయి.