రైల్వే శాఖ కీలక నిర్ణయం

భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి అన్ లాక్ 4 గైడ్ లైన్స్ అందుబాటులోకి రావడంతో రైల్వే ప్రయాణికుల కోసం మరో 100 రైళ్లను త్వరలోనే ప్రారంభించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం 230 ప్రత్యేక రైళ్లను రైల్వేశాఖ నడుపుతుంది. కొత్తగా రైళ్లను నడిపేందుకు హోంమంత్రిత్వశాఖ నుంచి రైల్వే శాఖకు అనుమతులు వచ్చాయని సమాచారం. అంతర్ రాష్ట్ర రవాణాకు ఎలాంటి నిబంధనలు విధించవద్దని కేంద్రం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో రైలు సర్వీసులు పెంచుకోవడంపై ఆ శాఖ దృష్టి సారించింది.ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలతో రైల్వేశాఖ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. మార్చి 25 నుంచి లాక్‌డౌన్ కారణంగా రైలు సర్వీసులను రద్దు చేసిన రైల్వే శాఖ మే 1 నుంచి వలస కార్మికుల కోసం శ్రామిక్ రైళ్ల పేరుతో ప్రత్యేక సర్వీసులను నడిపింది. మే 12 నుంచి 15 ఏసీ రైళ్లతో పాటు ప్రారంభించిన రైల్వేశాఖ జూన్ 1 నుంచి షెడ్యూల్ ప్రకారం నడిచే రైళ్లను ప్రారంభించింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 230 రైళ్లు నడుస్తుండగా వాటికి మరో 100 రైళ్లు జతకట్టనున్నాయి. దశల వారీగా రైళ్ల సంఖ్యను పెంచేందుకు రైల్వేశాఖ కసరత్తు చేస్తుంది.