నిన్న, మొన్న, నేడూ… నిజమైన ఆపద్బాంధవుడు: సోనూ సూద్

ఎక్కడ కష్టమొచ్చినా నేనున్నాఅంటూ అభయ హస్తం అందిస్తున్నబాలీవుడ్ నటుడు సోనూ సూద్ పేరు ఇపుడు దేశ వ్యాప్తంగా మార్మోగిపోతోంది.. కరోనా కష్ట కాలంలో వలస కూలీలు మొదలుకుని కష్టమన్నవారికి తనవంతు సాయం చేస్తూ, కరోనా కారణంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోయి ఆర్దిక రేఖకు దిగువున ఉండి అర్హతకలిగిన వారికీ ఆప్ ద్వారా ఉద్యోగాలను కల్పిస్తా అంటూ ముందుకు వచ్చి… నిన్నటికి నిన్న తన ఇద్దరు కుమార్తెలను కాడెద్దులుగా మార్చి దుక్కితున్న రైతును చూసిన చలించిపోయిన ఈ సినీ విలన్.. వారికి ట్రాక్టర్ను అందించారు. ఆ తర్వాత కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి కూరగాయలు విక్రయించుకుంటున్న శారదకు సోనూసూద్ ఉద్యోగం ఇప్పించారు.

తాజాగా హైదరాబాద్ నగరానికి చెందిన 26 ఏళ్ల ఉండాది శారదాను కరోనా కారణంగా తన ఉద్యోగం నుంచి తొలగించారు. దీంతో ఆమె కుటుంబం గడవడానికి కూరగాయలను విక్రయిస్తూ జీవించసాగింది.

ఈ విషయం పలు వార్త పత్రికలలో ప్రచురించగా… రిట్చీ షెల్సన్ అనే యువకుడు తన ట్విట్టర్‌ ఖాతాలో శారదకు సాయం చేయ్యండి అని…. ట్వీట్ చేస్తూ, సోనూసూద్‌కు ట్యాగ్‌ చేశాడు. దీనికి వెంటనే స్పందించిన సోనూసూద్‌ తన అధికారి ఆమెను కలిశారని. ఆమెకు ఉద్యోగ నియామక లేఖ కూడా అందిందని ఆయన ట్వీట్‌ చేశారు.

శారద ‘నేను సోనూసూద్‌ను చాలా కాలం నుంచి గమనిస్తున్నా.. ఆయన చాలా మంది పేదలకు సాయం చేస్తున్నారు అన్నారు’. అయితే ఆమెకు ఎలాంటి జాబ్‌ ఆఫర్‌ వచ్చిందో ఆమె తెలుపలేదు.

మరోవైపు లాక్ డౌన్ వల్ల కిర్గిస్తాన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులకు కూడా సోనూసూద్‌ సాయం చేశారు. 250 మంది తెలుగు విద్యార్థులను స్వదేశానికి రప్పించారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం వీరభద్రాపురానికి చెందిన కొర్ల భార్గవచౌదరి.. కిర్గిస్థాన్‌లోని బిస్కెక్‌ ఆసియన్‌ వర్సిటీలో ఎంబీబీఎస్‌ చేస్తున్నారు. స్వస్థలానికి వచ్చేందుకు సోషల్‌ మీడియా ద్వారా తెలియజేయగా.. వీడియో చూసి సోనూ సూద్ స్పందించారు. ఆ దేశంలోని భారత రాయబార కార్యాలయం ప్రతినిధులతో మాట్లాడారు. ప్రత్యేక విమానం ఏర్పాటుచేసి.. అందులో వారిని స్వస్థలాలకు రప్పించారు సోనూ సూద్.