జగనన్న కాలనీలో అధికార పక్షం ఆగడాలు…!

  • పట్టాలు ఇచ్చి లబ్ధిదారులకు కేటాయించిన స్థలంలో దౌర్జన్యంగా అధికార పక్షం ఇళ్ల నిర్మాణాలు
  • పత్తాలేని రెవెన్యూ, సచివాలయ అధికారులు
  • జిల్లా అధికారులు స్పందించాలన్న జనసేన పార్టీ నాయకులు

పార్వతీపురం పట్టణానికి కూతవేటు దూరంలో, గోపాలపురం గ్రామ సమీపంలో పేదలకు ఇళ్ల కోసం ఏర్పాటుచేసిన జగనన్న కాలనీలో అధికార పక్షం ఆగడాలు పెచ్చు మీరుతున్నాయని జనసేన పార్టీ నాయకులు ఆరోపించారు. బుధవారం జనసేన పార్టీ జిల్లా నాయకులు చెందక అనిల్ కుమార్, వంగల దాలి నాయుడు, బంటు శిరీస్, రాజాన రాంబాబు, సిరిపురపు గౌరీ శంకర్, మండల శరత్ బాబు తదితరులు గోపాలపురం వద్ద ఉన్న జగనన్న కాలనీని పరిశీలించారు. ఈ సందర్భంగా అధికార పక్షం ప్రజా ప్రతినిధుల దౌర్జన్యానికి బలైన లబ్ధిదారులు జనసేన పార్టీ నాయకులతో తమ గోడును వెళ్ళబుచ్చారు. ఈ సందర్భంగా పార్వతీపురం మున్సిపాలిటీలోని మూడో వార్డు, వివేకానంద కాలనీకి చెందిన మంతిని శారద భర్త రాము మాట్లాడుతూ గతంలో తమకు జగనన్న కాలనీలో పట్టా ఇచ్చి స్థలాన్ని చూపి, ఆ స్థలంలో తన భార్యను నిలబెట్టి ఫోటో తీసి స్థలము అప్పగించారన్నారు. ఆ స్థలంలో పార్వతీపురం మున్సిపాలిటీకి చెందిన ఓ ప్రజా ప్రతినిధి పునాదులు తీసి ఇంటి నిర్మాణం చేపడుతున్నారన్న విషయం తెలుసుకొని వారిని ప్రశ్నిస్తే తమకు ఈ స్థలంలో ఇల్లు కట్టుకోమన్నారని సమాధానం ఇచ్చారన్నారు. తమకు కేటాయించిన స్థలంలో అధికార పక్షానికి చెందిన ప్రజాప్రతినిధులు దౌర్జన్యంగా నిర్మాణ పనులు చేస్తున్నడంతో ఏమి చేయలేక బాధపడుతున్నామన్నారు. ఈ విషయమై సంబంధిత అధికారుల వద్ద మొరపెట్టుకున్న ఫలితం లేదన్నారు. తనతోపాటు జగనన్న కాలనీలో పలువురు స్థలాలను దౌర్జన్యంగా ఆక్రమించి ఇళ్ల నిర్మాణాలు చేస్తున్నారన్నారు. ఉన్నతాధికారులు, పాలకులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ జగనన్న కాలనీలో పార్వతీపురంలో జగడాల కాలనీలుగా మారన్నారు. ఒకరికి కేటాయించిన స్థలంలో దౌర్జన్యంగా ఇంటి నిర్మాణాలు చేయటం ఎంతవరకు సమంజసమో ఆలోచించాలన్నారు. ఈ విషయమై జిల్లాస్థాయి అధికారులు చర్యలు చేపట్టి బాధితులకు న్యాయం చేయాలన్నారు. జగడాల కాలనీలో గొడవలు జరగకుండా పోలీస్ అధికారులు కూడా దృష్టి సారించాలని కోరారు. పాలకులు, అధికారులు కలిసి సమస్యను పరిష్కరించాలన్నారు. లేని పక్షంలో జనసేన పార్టీ జనసైనికులు రోడ్డు ఎక్కాల్సి వస్తుందని హెచ్చరించారు.