తుపాన్ వల్ల నష్టపోయిన రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు

నివర్ తుపాన్ కారణంగా రైతాంగం అన్ని విధాలుగా పోయింది.. అయినప్పటికీ వారికి తక్షణ సాయం, రైతులు కోరుతున్న పరిహారం ఇవ్వడంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని కనబరుస్తోందనిజనసేన – బీజేపీ పార్టీలు అభిప్రాయపడ్డాయి. ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్ నివర్ ప్రభావిత జిల్లాల్లో చేపట్టిన పర్యటనలో రైతుల వేదన వెల్లడైందని ఇరు పార్టీలు స్పష్టం చేశాయి.  హైదరాబాద్ లో ఇరు పార్టీల ముఖ్య నాయకులు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో అధినేత పవన్ కల్యాణ్, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, బీజేపీ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) శ్రీ వి.సతీష్  గారు, బీజేపీ ఏపీ కో ఇంచార్జ్ శ్రీ సునీల్ దేవధర్ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ మధుకర్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కల్యాణ్ రైతుల కోసం చేపట్టిన పర్యటన గురించి చర్చించారు.

తుపాన్ వల్ల నష్టపోయిన రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రైతుల్లో నిరాశానిస్పృహలు తొలగించడం తమ తక్షణ కర్తవ్యమని తెలిపారు. ఏలూరులో అంతుబట్టని అనారోగ్య సమస్యలపై కేంద్ర బృంద విచారణ అవసరమన్నారు. జనసేన, బీజేపీ ముఖ్య నాయకుల సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. తుపాను వలన నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆర్థికాభివృద్ధికి దోహదపడే చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందని, ఫలితంగా నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. అంతేకాకుండా రాయలసీమలో రైతాంగం ఇబ్బందిపడుతోందని తెలిపారు. రాష్ట్రంలో రోడ్డు వ్యవస్థ అధ్వానంగా తయారైందని విమర్శించారు.

రాజకీయ కార్యాచరణపైనా చర్చ…

రానున్న తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికతోపాటు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక కోసం మార్గదర్శకాలను రూపొందించుకోవాలని బీజేపీ, జనసేన ముఖ్య నాయకులు నిర్ణయం ఈ సమావేశంలో నిర్ణయించారు. అంతేకాకుండా రాష్ట్రంలో అమలు కాని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ విధానాన్ని రాష్ట్రంలో అమలు అయ్యేలా కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని తీర్మానించుకున్నారు. రాష్ట్ర రాజకీయ, ఆర్థిక పరిస్థితులను ప్రధాని దృష్టికి తీసుకెళ్లాలని నాయకులు నిర్ణయించారు.