ఓట‌మి భయంతోనే వైసీపీ ప్ర‌లోభాల‌కు తెర‌: పెంటేల బాలాజీ

చిల‌క‌లూరిపేట‌, అధికారంలో ఉన్న వైసీపీ ప్ర‌భుత్వం ఎన్నిక‌ల ముందే ప్ర‌లోభాల‌కు తీర‌తీసిందని, లొంగ‌ని వారిపై బ్లాక్‌మెయిల్ రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతుంద‌ని జన‌సేన‌పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో -కన్వీనర్ పెంటేల బాలాజీ ఆరోపించారు. శుక్ర‌వారం ఆయ‌న కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌ర్ల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ ప్ర‌జ‌ల్లో అధికార వైసీపీ ప్ర‌భుత్వంపై తీవ్ర స్థాయిలో వ్య‌క్త‌మౌతున్న వ్య‌తిరేక‌త‌ను గ‌మ‌నించి, అడ్డ‌దారిలో గెల‌వాల‌ని ఆ పార్టీ నాయ‌కులు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ద్వ‌జ‌మెత్తారు. ఇందుకు వాలంటీరి వ్య‌వ‌స్థ‌ను వాడుకుంటూ నిర్ల‌జ్జ‌గా ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేస్తున్నార‌ని మండి ప‌డ్డారు. నేరుగా ఎన్నిక‌ల కురుక్షేత్రంలో గెల‌వ‌లేమ‌ని తెలిసి, ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలోనూ ప్ర‌జ‌ల‌కు ముందే తాయిలాలు పంపిణీ చేస్తున్నార‌ని, ఎవ‌రైనా ప్ర‌శ్నించినా, వారికి వ్య‌తిరేకంగా మాట్లాడినా ప‌థ‌కాలు తొల‌గిస్తామ‌ని బ్లాక్‌మెయిల్‌కు దిగుతున్నార‌ని విమ‌ర్శించారు. జ‌న‌సేన సైనికులు, వీర‌మ‌హిళ‌లు అనునిత్యం అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించారు. జనసేన పార్టీ పదేళ్ల క్రిందట సిద్దాంతాలతో ఆవిర్భవించిందో అదే సిద్దాంతాల కోసం జనసైనికలు, వీర మహిళలు అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ప్రతీ జనసైనికుడు పార్టీకోసం శ్రమిస్తున్నారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించేందుకే జనసేన పార్టీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుందన్నారు. వైసీపీ ఎన్ని బీరాలు పలికినా, రానున్న ఎన్నికల్లో జనసేన-టీడీపీ-బీజేపీ, పార్టీల కూటమి విజయం సాధించడం ఖాయమన్నారు. ప్రజలను రక్షించడం కోసం మూడు పార్టీల కలయిక అవసరమన్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని మొదటి నుంచి చెబుతూ వస్తున్న పవన్‌ కల్యాణ్‌ మాటలు నేటికి కార్యరూపం దాల్చుతున్నాయని వివ‌రించారు.