ఎన్నికల సమరం… గొల్లప్రోలులో కత్తులతో వీరంగమేసిన ఇరు వర్గాలు

పంచాయతీ ఎన్నికల వేళ తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం చినజగ్గంపేటలో ఇరు వర్గాలు కత్తులతో చెలరేగిపోయాయి. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. బాధితుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇక, పంచాయతీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లోనూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం పల్లెపాలెంలో డబ్బులు పంపిణీ చేస్తున్న కొందరిని గ్రామస్థులు అడ్డుకున్నారు. చిత్తూరు జిల్లా బొట్లవారిపాలెంలో గత అర్ధరాత్రి వైసీపీ మద్దతుదారులు కొందరు హల్‌చల్ చేసి ప్రత్యర్థులపై దాడికి దిగారు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ బాధితులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. పోలీసులు రంగంలోకి దిగడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.