శరద్ పవార్‌ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ.. పోరాటానికి మద్దతు ఇవ్వాలని వినతి

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి మద్దతు కోరుతూ పోరాట కమిటీ, ఉద్యోగ సంఘాల నేతలు నిన్న ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌ను కలిశారు. ఢిల్లీలో నిన్న శరద్ పవార్ నివాసంలో ఆయనను కలిసిన నేతలు వినతిపత్రం సమర్పించి ఉద్యమానికి అండగా నిలవాలని అభ్యర్థించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి ప్రతి ఏటా వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి పన్నుల రూపంలో అందుతున్నాయని ఈ సందర్భంగా పవార్ దృష్టికి తీసుకెళ్లారు.

 సొంత గనులు లేకున్నా నాణ్యమైన ఉక్కును అందిస్తోందని, ఈ పరిశ్రమపై ఆధారపడి వేలాది కుటుంబాలు జీవిస్తున్నాయని పేర్కొన్నారు. పార్లమెంటులో ఈ విషయాన్ని ప్రస్తావించి స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా అడ్డుకోవాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన శరద్ పవార్.. ఈ అంశాన్ని పార్లమెంటులో చర్చకు పెడతామని, ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. అనంతరం పోరాట నేతలు ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే, డీఎంకే ఎంపీ షణ్ముగం, బీఎస్పీ రాజ్యసభ సభ్యుడు శ్రీరాంజీలను కలిసి మద్దతు కోరారు.