మహిళా భద్రతను గాలికొదిలేసిన వైసీపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ లో వరుస అత్యాచారాలకు కారణాలేంటి? అన్నెం పున్నెం ఎరుగని పసిపిల్లల నుండి మహిళల దాకా, మృగాళ్ల బారిన పడడానికి కారణాలేంటీ? ఈ అత్యాచార ఘటనలను అరికట్టలేమా? ఈ అకృత్యాలను అరికట్టడానికి ప్రభుత్వం చేపట్టిన చర్యలు, ప్రభుత్వ చిత్తశుద్ది ఎంత? ఇప్పటి ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆడబిడ్డలను కాపాడలేని వ్యక్తి ముఖ్యమంత్రిగా అనవసరమన్నారు. అర్ధరాత్రి 12 గంటలకు ఆడపిల్లలకు తిరిగే స్వేచ్ఛనివ్వాలి. ఎవరైనా ఆడబిడ్డ వైపు తప్పుగా చూస్తే గుడ్లు పీకేయాలని ఉత్తర కుమార ప్రగల్భాలు పలికారు. సుగాలి ప్రీతి తల్లికి ఇచ్చిన మాటను కూడా జగన్ ప్రభుత్వం నిలబెట్టుకోలేక పోయింది. పవన్ కళ్యాణ్ గారి పోరాటాన్ని దిగివచ్చిన ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ వేసినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి ఫలితం లేదు. 2019లో రాష్ట్రంలో, మహిళలపై అకృత్యాలు 7% పైగా పెరిగాయని, నేషనల్ క్రైంస్ రికార్డ్స్ బ్యూరో చెబుతోంది. అంటే జగన్ గారి ప్రభుత్వం మహిళల రక్షణ గురించి ఎలాంటి ప్రత్యేక శ్రద్ద తీసుకోలేదని తేల్చి చెబుతోంది. నేనున్నా, నేను విన్నా, గన్ కంటే ముందు జగన్ అంటూ పెయిడ్ కార్యకర్తలతో ఒక ఊత పదం జనాల్లోకి వదిలి, “సంపూర్ణ మద్యపాన నిషేధం” చేస్తానని, తద్వారా అక్కచెళ్ళమ్మల ఇంట్లో ఆనందం చూపిస్తానని అన్నారు. అధికారంలోకి రాగానే, బెల్టు షాపులు మాత్రమే మూయించి, మద్యం అమ్మకాలు తమ చేతుల్లోకి తీసుకుని, పిచ్చి పిచ్చి బ్రాండ్లను ఆంధ్రా యావత్తూ అమల్లోకి తెచ్చి, తాను చెప్పేది వేరే, చేసేది వేరే అంటూ ఫక్తు రాజకీయ నాయకుడి అవలక్షణాన్ని రాష్ర్ట ప్రజలకు సిగ్గులేకుండా చూపించారు. రాష్ట్రంలో, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు గల ముఖ్య కారణం జగన్ ప్రభుత్వం. తన బినామీల ద్వారా అమ్ముతున్న బూమ్ బూమ్ లాంటి పిచ్చి బ్రాండ్ల వల్లనే అని భోగట్టా! ఇలాంటి బ్రాండ్లు తాగి, ఆ మత్తులో కన్నూ మిన్నూ కానకుండా ఆడపిల్లలపై మందు రాయుళ్లు చేసే అత్యాచారాలకు జగన్ గారి ప్రభుత్వానిదే పూర్తి భాధ్యత. కృష్ణా నది ఒడ్డున ఒక జంట మీద జరిగిన దాడి. కాబోయే భర్తను దారుణంగా కొట్టి, మహిళపై మద్యం మత్తులో ఇద్దరు దుండగులు చేసిన అత్యాచార ఘటన. ఆ ఇద్దరిలో ఒక నిందితుడ్ని ఇప్పటిదాకా పట్టుకోలేక పోవడం జగన్ ప్రభుత్వ అసమర్ధతకు మచ్చుతునక. తెలంగాణా రాష్ట్రంలో జరిగిన ఒక దారుణ ఘటన, తన సొంత సోదరికి జరిగినట్టుగా బిల్డప్ ఇచ్చి, చలించిపోయిన(ట్టు) జగన్ రెడ్డి, ఆవేశంతో ఆంధ్రప్రదేశ్‌ క్రిమినల్ లా (సవరణ) చట్టం-2019′ ‘ఏపీ ‘దిశ’ యాక్ట్‌ పేరుతో అసెంబ్లీలో “దిశ” చట్టాన్ని తెచ్చారు. ఇది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆమోదం పొంది రెండేళ్లు కావస్తోంది. మరి ఎంతమందికి న్యాయం జరిగింది? దిశా చట్టంలో ఏం చెప్పారు? “దిశా చట్టం” ఈ చట్టంలో అతి ముఖ్యమైన విషయం, “మహిళలపై లేదా ఆడపిల్లలపై అత్యాచార కేసుల్లో, నేరం జరిగినట్లు నిర్ధారించే ఖచ్చితమైన ఆధారాలు గనుక ఉంటే, రేపిస్టులకు 21 రోజుల్లోపే కోర్టులు మరణశిక్ష విధిస్తాయి” దిశ చట్టం అమలు కోసం రాష్ట్ర స్థాయిలో ఇద్దరు మహిళా అధికారులను నియమించారు. ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రత్యేకంగా దిశ పోలీస్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేశారు. అప్పటికే ఉన్న మహిళా పోలీస్ స్టేషన్లను దిశ స్టేషన్లుగా తీర్చిదిద్దారు. ప్రత్యేక కోర్టులు కూడా ఏర్పాటు చేస్తామని ఈ చట్టంలో ప్రతిపాదించారు. మహిళలకు సంబంధించిన దాడులు, వేధింపుల కేసుల్లో వారం రోజుల్లో పోలీసుల దర్యాప్తు, ఆ తర్వాతి 14 రోజుల్లో ప్రత్యేక కోర్టు విచారణ ముగించేయాలని ఈ చట్టంలో పేర్కొన్నారు. అంటే, ఈ చట్టం ప్రకారం, అత్యాచార ఘటన జరిగిన 21 రోజుల్లో తీర్పు ఇవ్వాలి. ఈ చట్టంలో లోపాలు ఉన్నాయని, తాము చేసే సూచనలు తప్పకుండా పాటించాలని కేంద్రం ఈ చట్టాన్ని తిరిగి రాష్ట్రానికే వెనక్కు పంపితే, జగన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటిదాకా పట్టించుకోలేదు. “దిశా చట్టం” చేశారు, ఆర్భాటంగా ప్రత్యేక పోలీస్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేశారు గానీ, పెరిగిపోతున్న జనాభాకు అనుగుణంగా ఎంతమంది పోలీసులు ఉండాలి, మహిళలపై జరిగే దాడులను అరికట్టేందుకు ఎలాంటి సదుపాయాలు ఉండాలి, ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుకు ఎన్ని నిధులు అందజేయాలి, పోలీస్ వ్యవస్ధను ఎలా ఆధునీకరణ చెయ్యాలి అన్న మాటలే మరిచిపోయారు. మన రాష్ట్రవ్యాప్తంగా దిశ చట్టం ఆమోదించిన తర్వాత, డిసెంబర్ 12, 2019 నుండి ఇప్పటి వరకూ వెయ్యికి పైగా లైంగిక దాడుల కేసులు నమోదయ్యాయి. కానీ ఈ కేసుల్లో నిందితులకు గత చట్టాల ప్రకారమే శిక్షలు పడుతున్నాయి. రెండు మూడు రోజుల క్రితం మాత్రమే ఒక వ్యక్తికి ఉరిశిక్ష విధించారు. ఈ ఘటనలో వీడియో సాక్ష్యాలతో సహా అన్ని ఆధారాలు ఉన్నా కూడా, ఆ వ్యక్తిపై కేసులో తీర్పు ఇవ్వడానికి పట్టిన కాలం ఒక సంవత్సరం. మహిళలపై జరిగే నేరాల్లో, ఆధారాలు ఉన్నా చట్టాల అమల్లో వైసీపీ ప్రభుత్వం ఎంత దారుణంగా వెనుకబడి ఉన్నదో చెప్పడానికి ఇదే అతి పెద్ద ఉదాహరణ. చట్టాలు పక్కాగా అమలు చెయ్యాలి అంటే అందుకు తగ్గ పోలీసుల సంఖ్య కూడా ఉండాలనేది ముఖ్యమంత్రికి తెలియని విషయమేమీ కాదు. 2020 అక్టోబర్ 21 న, పోలీస్ సంస్మరణ సభలో ప్రతీ ఏడాది ఆరువేల మంది పోలీసులను రిక్రూట్మెంట్ చేసి, పోలీసులపై పనిభారం తగ్గిస్తామని చెప్పిన సీయం జగన్, మూడేళ్లలో ఒక్క పోలీస్ రిక్రూట్మెంట్ కూడా ప్రకటించకుండా అటు నిరుద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి రగిలించి, ఇటు శాంతి భద్రతలను పాటించే పోలీసులపై తీవ్ర పెనుభారం మోపారు. ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయని అంతకన్నా ఎక్కువ భాద్యతారాహిత్యంతో మన మరో మహిళా హోమ్ మంత్రి వనిత గారు పబ్లిగ్గా శెలవియ్యడం, ఆంధ్రా ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం! అత్యాచార భాదితులకు సుమారు 120 కోట్లు పరిహారం కింద చెల్లించామని హోమ్ మంత్రి గారు గొప్పగా చెప్పుకోవడం, మహిళా లోకానికి తీవ్ర అవమానం, దారుణాతి దారుణం! చేతగాని వైసీపీ ప్రభుత్వ పాలనలో, ఆంధ్రాలో రాష్ట్రంలో పెరుగుతున్న అత్యాచారాల కట్టడికి పోలీసు ఉన్నతాధికారులే ప్రత్యేక శ్రద్ధ చూపాలని, గౌరవ హైకోర్టు వారు, మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలను సుమోటోగా తీసుకోవాలనీ, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప సూచన ఇచ్చారు. మానవతా దృక్పథంతో ఈ సూచన అమలు చేస్తే, మహిళలపై జరిగే అత్యాచారాలు కొంతవరకైనా అరికట్టవచ్చు. మాజీ మంత్రి అవంతి నుండీ తాజా మంత్రి అంబటి వరకూ మహిళల పట్ల వారి నైజం సోషల్ మీడియాలో ఉన్న ప్రతీ ఒక్కరికీ తెలుసు. ఇలాటి వారికి ఉన్నత పదవులిచ్చి, వారికి పోలీసులను శాసించే స్థాయికి తెచ్చిన జగన్ గారి నాయకత్వంలో మహిళల కు రక్షణ దొరుకుతుంది అననుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. అందుకే… పాలన మారాలి. “తప్పు చేస్తే తన తలైనా తెగి పడాలి” అనే పవన్ కల్యాణ్ గారి ధీరోదాత్త నాయకత్వం రావాలి. “యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా యత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్రఫలా: క్రియా:” అంటూ పద్యాల్లో మాత్రమే ఆడవారిని పూజించే రోజులు చుడాల్సి వస్తుంది. మృగాళ్ల చేతుల్లో బలైపోయిన సుగాలి ప్రీతి లాంటి ఆడపిల్లలకు న్యాయం చెయ్యాలి అంటూ దశాబ్దాల పాటు పోరాడుతూనే ఉండాల్సి వస్తుంది. ఈ కార్యక్రమానికి ఎస్ వి బాబు, బత్తిన హరి రామ్, కూనసాని నాగబాబు, పండమనేని శ్రీనివాస్, ర్యాలీ సత్యనారాయణ, పుప్పాల పాండురంగారావు, జన్యువుల నాగబాబు, కొప్పి నీటి శివమణి, పుల్లేటి దుర్గారావు, చీర్ల నవీన్ కృష్ణ, జోగి రవీంద్రబాబు, కూనపరెడ్డి రంగయ్య, బత్తిన రమేష్, బత్తిని నరేష్, శిరం సంతోష్, వాసన కుమారస్వామి, కనపర్తి వెంకన్న, బోయన నరేంద్ర, పినిశెట్టి రాజు పెద్ద ఎత్తున జన సైనికులు పాల్గొన్నారు.