అప్పుడు ప్రతి రోజూ… ఉగాదే!

నాయుడు బావ హుషారుగా ఇంటికొచ్చి, ”ఓసేయ్ ఎంకీ! రాయే…ఇయ్యాల ఉగాది పండగ గందా… కాసేపు టీవీ సూద్దారి…” అంటూ పిలిచాడు.
వంటింట్లోంచి ఎంకి వచ్చి, ”ఓలొల్లకో బావా! పండగైతే మనకేంది? పబ్బమైతే మనకేంది? మనలాటోళ్లకి ఉగాదైనా ఒకటే, సంక్రాంతైనా ఒకటే…” అంటూ తువ్వాలందించింది.
”అదికాదేస్‌… మన తెలుగోళ్లందరికీ ఇదే తొలి పండగంట. కవులు కవితలూ, పజ్యాలు సెబుతారంట. శాస్త్రులు గోరు పంచాంగం సదువుతారంట… ”
”ఏందో నీ సంబడం. కవితలూ పజ్యాలు వింటే మన బతుకులు బాగు పడతాయా ఏమన్నానా? నాలుగేళ్ల నుంచీ నానా కట్టాలూ పడతన్నాం… పంచాంగం వింటే మాత్రం అయ్యన్నీ తీరేవా, సచ్చేవా?”
”ఊరుకోయే. ఎప్పుడు సూసినా ఊకే నస పెడతా ఉంటావు. పండగ నాడైనా పసందుగా ఉండొద్దేంటి?”
”సర్లె…పెట్టు. వద్దంటే మాత్రం నువ్వూరుకుంటావేటి?” అంటూ ఎంకి టీవీ ముందు చతికిల పడింది. నాయుడు బావ టీవీ స్విచ్చు నొక్కి ఎంకి పక్కనే కూర్చుని రిమోటు నొక్కాడు.
ఓ ఛానెల్లో ఓ వ్యక్తి మెత్తగా నవ్వుతూ కనిపించాడు. మైకు పట్టుకుని చెప్పసాగాడు.
”ఓ అమ్మ ఓ అక్క ఓ చెల్లి ఓ అవ్వ
మీకు పెడతానమ్మ కడుపునిండా బువ్వ
ఓ అన్న ఓ తాత ఓ మామ ఓ బాబు
నిండుగా నింపుతా మీకున్న జేబు
నాకు ఓటేయండి నన్నెన్నుకోండి
మీ బతుకు మారేను నన్ను నమ్మండి”
నాయుడు బావ ఎంకి మొహం చూసి, ”ఏందే ఇది? కవిత్వమా?” అన్నాడు.
ఎంకి నవ్వి, ”ఓపాలి నువ్వెట్టిన ఛానెలు సూడు. అదెవరదనుకున్నావు? నాలుగేళ్లుగా మన నెత్తికెక్కి ఏలుతున్నాడే ఆయనదే. మరాళ్ల ఛానెల్లో ఇట్టాంటి సొల్లు మాటలు తప్ప ఇంకేటొస్తాయి? పండగ్గానీ, పబ్బంగానీ ఎట్టాగొట్టాగ పెచారం చేసుకుందామనే సూత్తారాళ్లు. మొన్నటికి మొన్న శివరేతిరికి ఏంజేసేరో గుర్తునేదా? గుడి ముందట శివుడేసంలో ఉండే ఓ సిన్న పిల్లకి ఆయన పాలు పడుతున్నట్టు బొమ్మ వేయించలా? మరిది పెచారంతో పాటు వేరేవోళ్ల నమ్మకాలని కూడా ఎటకారం సేయడం కాదేటి? అక్కడకీయక్కడే పేద పిల్లల్ని ఉద్దరించేటోడా? మరీయన పాలనలో సదూకునే పిల్లగాళ్లే కాదు, హాస్టళ్లలో ఉండే పిలకాయలు కూడా నానా కట్టాలూ పడతన్నారని నీకు తెల్దా? నాకు తెల్దా? అసలు అందాకా ఎందుకు బావా? అంతక్రితం ఊరి గోడల మీద సినేమా పోస్టర్లు కనిపించేవి. మరిప్పుడో? యాడ సూసినా ఆళ్ల గొప్పలూ డాబులూ రాసిన పోస్టర్లే. ఆటి నిండా నానా రాతలే. సూత్తన్నావా అసలు?”
”అవునే ఎంకీ. ఎదురింటి గోడ మీద కాగితం అంటించారు. ‘కోట్లాది గుండెల్లో ఒకే ఒక్కడం’ట…’
”కోట్లు కొట్టేసిన ఒకే ఒక్కడేం’ కాదూ? ఆళ్లు ఏం రాసినా మనం మరోలా సదువుకోవాల బావా. మరి ఈ నాలుగేళ్లలో అదేగందా జరిగింది? పగలంతా రెక్కలు ముక్కలు సేసుకుని కట్టపడి పదో పరకో సంపాదిత్తావా? అదుచ్చుకుని తిన్నగా ఇంటికొత్తావేటి నువ్వు? అదేదో కొత్త సరుకొచ్చిందంటే ఓ సుక్క ఏసుకొచ్చేనే ఎంకీ అంటూ మత్తులో వచ్చి వాగుతావు. అసలు మన రాట్రంలో ఉన్నన్ని సారా రకాలు దేశంలో మరెక్కడా లేవంట నీకు తెలుసా? మరా కొత్త కొత్త కంపెనీలన్నీ ఇక్కడ సరుకు అమ్ముకోవాలంటే దండిగా ముడుపులు ముట్టజెబుతారంట. పైగా ఇక్కడ సరుకు తయారు చేసే పర్మిట్లు కూడా ఆళ్ల వోళ్లకే ఎడాపెడా ఇచ్చేసి డబ్బులు నొక్కేశారంట, తెల్సా? ఇలాగ ఒక్క మద్యమేనేటి? ఇసుక రేవుల యవ్వారం సూడు, గనుల యాపారం సూడు, గంజాయి సాగు సూడు, సర్కారు జాగాల దఖలు సూడు, ఓడరేవుల పంపిణీ సూడు… ఏది సేసినా కాసులు నొక్కేయడమేనంట. వాటాలు అందుకోడమేనంట తెలుసా?”
”వాసినీ బలే సెప్పావే? ఇందాకా ఇంటికొస్తంటే పక్కింటి గోడ మీద మరో పోస్టర్‌ చూసానేవ్‌. ‘పాలకుడు కాడు సేవకుడం’ట. ‘మా నమ్మకం నువ్వే’నంట. ఇంకేదో ‘భరోసా’ అంట, ‘ఆసరా’ అంట. ఎటు కేసి సూసినా అయ్యే… అదేటోగానీ?”
”కాదేటి మరి. అదంతా ఆళ్లకాళ్లు సేసుకునే పెచారం. ఆ పోస్టర్లలో ఉన్న రాతల్ని మనం మరోలా సదువుకోవాల. ‘పాలకుడు కాడు పాతకుడు’ అని సదూకోవాల. ‘మా అపనమ్మకం నువ్వేనంట’ అని మార్చుకోవాల. ఇక భరోసా, ఆసరాలు కాదు ‘ఈసురో’మని తెలుసుకోవాల. తెల్సిందా?”
నాయుడు బావ ఏదో అనేలోగా టీవీలో నేత మళ్లీ అందుకున్నాడు.
”తొమ్మిది పధకాలంట
ఉమ్మడి పంపకమంట
మీట నొక్కితే చాలు,
మీ కాతాలో కాసులంట!”
”అవునేగానీ ఎంకీ… నేరుగా డబ్బులు పడేలా సేత్తంటే మరిలా సెప్పుకుంటే తప్పేముందే?” అన్నాడు నాయుడు బావ.
ఎంకి పకపకా నవ్వి, ”ఓరెర్రి బావా. నీలాంటోల్లింకా కొందరుండబట్టే, ఆయన ఆటలిలా సాగుతన్నయి. మీట నొక్కి ఆయనిచ్చేదెంతో, దొడ్డిదారిలో దోచుకునేదెంతో తెల్దు నీకు. పావలా ముష్టి విదిల్చి తిరిగి పది రూపాయలు మనకాడే లాగేసుకుంటున్న సంగతి తెల్సుకోలేవా? ఈళ్ల పాలనొచ్చాక అన్ని సరుకుల ధరలు ఎలా పెరిగాయో నీకెరికేనా? మరది మన జేబుకి సిల్లు కాదేటి? లీటరు పెట్రోలు కొంటే రోడ్లు బాగు చేయడానికంటూ ఎక్కువ దుళ్లగొడుతున్నారా? మరొకపాలి మన రోడ్లకేసి సూడు. ఎక్కడన్నా మరమ్మతులైనా సేసారా అని? మరిలా మనందరి దగ్గరా పోగు చేసిన సొమ్ము లక్షల కోట్లలో ఉంటదంట. ఆటికి లెక్కా జమా ఉందా అసలు? అంతెందుకు బావా… మనింట్లో పోగయ్యే చెత్త మీద కూడా పన్నేసి మన సొమ్ము లాగేత్తన్నారా లేదా? నీలాంటోళ్లు తాగే మందు అసలు ధర పది రూపాయలైతే, మీకాడ గుంజుకుంటున్నది అంతకు పదింతలంట. దానికుందా లెక్క? కేంద్ర సర్కారోళ్లు పేదోళ్ల కోసమని ఉచితంగా ఇచ్చే రేషను బియ్యాన్ని కూడా బెదిరించి, బులిపించి పోగుసేసి ఇదేశాలకి ఓడల్లో తోలేత్తన్నారంట తెలుసా? మొన్న మన్యంలో మా పిన్ని కొడుకుని ఆశపెట్టి గంజాయి సాగు సేయించి పంట పట్టుకుపోనారంట. ఆనక కేసయి ఆడు పాపం జైలుకెళితే, ఆ గంజాయి తోలిన సొమ్ముతో ఈళ్లు జల్సా సేత్తన్నారంట. ఇలా మన్యం బిడ్డలెంత మంది గగ్గోలు పెడతన్నారో ఎరికేనా నీకంట? దొంగసచ్చినోళ్లు, ఇన్నేసి దారుణాలు సేత్తా కూడా మీట నొక్కుతన్నామంటా, ఎదవ పెచారాలూ ఈల్లూను. ఆ దిక్కుమాలిన ఛానెలు మార్చు బావా…” అంటూ విసుక్కుంది.
నాయుడు బావ చటుక్కున రిమోటు మీట నొక్కాడు.
అందులో పంచాంగ శ్రవణం జరుగుతోంది.
”ఈ సంవత్సరంలో రాజు- బుధుడు. మంత్రి- శుక్రుడు. సైన్యాధిపతి-గురుడు. నీరసాధిపతి-చంద్రుడు. నవనాయకులలో 8 అధిపత్యములు శుభులకు, ఒక ఆధిపత్యము పాపునికి వచ్చినవి… ఇక ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాల విషయానికి వస్తే… ” అంటూ పండితుడు ఏదో చెబుతున్నాడు.
ఇంతలో ఎంకి చటుక్కున నాయుడుబావ చేతిలో రిమోటు లాక్కుని టీవీ కట్టేసింది.
”అదేంటే ఆయనేదో కొత్తేడాది ఫలితాలు సెబుతాంటే కట్టేసావు? పూర్తిగా వినొద్దేటీ?” అన్నాడు నాయుడు బావ.
ఎంకి నవ్వి, ”నీకో సంగతి సెప్పనా బావా? ఆయనేం సెప్పినా మన రాట్రంలో అది జరగదు తెలుసా?” అంది.
”ఎందుకు జరగదే? పంచాంగమా? మజాకా?”
”ఊరుకో బావా. మనసుట్టూ జరిగే పంచాంగం ఆయన భాషలో నేను సెబుతాను ఇనుకో. మన రాట్రంలో రాజు-శని. మంత్రి-కంత్రీ. సైన్యాధిపతి-రాహువు. ధనాధిపతి-కేతువు. నవనాయకుల్లో అందరూ పాపులే. ఈల్లందరినీ మతిమాలి నెత్తిన పెట్టుకున్నది మనవే. అందుకే నీరసాధిపతి-సామాన్యుడే. ఇక ఆదాయం రాజుకి అధికం. మనకి శూన్యం. వ్యయం మనకి అనంతం. ఆళ్లకి పరిమితం. నాలుగేళ్లుగా సూట్టం లేదూ, ఈళ్ల పరిపాలన బాగోతం? మనలాంటి సామాన్యులకి అసలెక్కడైనా సుకముందాని? పంట పండించే రైతన్నలు గిట్టుబాటు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సదువులు సక్రమంగా సాగక పిలగాళ్లు దిగాలు పడుతన్నారు. ఉద్యోగాలు లేక కుర్రాళ్లు కునారిల్లు పోతన్నారు. జీతాలు సరిగా అందక ఉద్యోగులు ఉసూరుమంటన్నారు. ఆడంగులకి రక్షణ లేదు. ధరలు, పన్నులు, సార్జీలు పెరిగిపోయి అందరూ అల్లాడుతన్నారు. నీకో సంగతెరికనా? దేశం మొత్తం మీద అప్పుల పాలైన జనం మన రాట్రంలోనే ఎక్కువంట. ఈమద్దెనే ఓ సర్వేలో ఈ సంగతి తేలిందంట. మనందరి బతుకులు ఇలా సతమతమవుతా ఉంటే ఉగాది వస్తే ఏందంట బావా?”
”వాసినీ! టీవీలో శాస్త్రులుగోరు సేప్పేదాని కంటే నవ్వు సెప్పే రాజకీయ పంచాంగమే బాగుందే. మరి మనకేటి దారి?”
”అద్గది బావా. ఇప్పుడు దార్లోకి వచ్చావ్‌. దీన్నిమార్చుకోవాలంటే అది మనసేతిలోనే ఉంది. రేప్పొద్దున ఎన్నికలొత్తన్నాయి గందా? అప్పుడు సూపించు నీ తడాఖా. ఇప్పటి పాతకులు నిన్ను ఎతుక్కుంటా వచ్చి నోటిచ్చి ఆశపెట్టారనుకో, నడ్డి మీద ఎగిరి తన్ను. మందు పోత్తామని ఊరించారనుకో, ముందు పళ్లూడగొట్టు. మాయ మాట సెప్పారనుకో, నమ్మమాక. ఆళ్లకి అవమానం జరిగితేనే మనకి రాజపూజ్జెం. నీ సేతిలో ఓటుంది. దాన్ని, మన కోసరం ఆలోసిస్తా, మన కోసమే పనిసేత్తా మన మద్దెనే తిరగాడుతన్న నిజమైన జన సేనా నాయకుడికే ఎయ్యి. అప్పుడు సూడు ప్రతి రోజూ ఉగాదే. ప్రతి రోజూ పండగే మరి”.