హైదరాబాద్‌లో రానున్న రెండు భారీ ఆకాశ మార్గాలు

ఆధునిక తరహాలో మరో రెండు భారీ ఆకాశ మార్గాలు హైదరాబాద్‌లో రానున్నాయి. రానున్న కొన్ని సoవత్సరాల  అవసరాలను దృష్టిలో పెట్టుకుని రెండస్తుల్లో (జీ+2) పద్ధతిలో రోడ్డు, ఫ్లై ఓవర్‌ కమ్‌ మెట్రో కారిడార్‌తో కూడిన స్కైవేల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. జూబ్లీ బస్టాండ్‌ నుంచి శామీర్‌పేట, ప్యారడైజ్‌ నుంచి కొంపల్లి ఆర్వోబీ వరకూ రెండస్తుల్లో నిర్మాణానికి (డబుల్ డెక్కర్) హెచ్‌ఎండీఏ ప్రణాళికలు రూపొందించింది. జేబీఎస్‌-శామీర్‌పేట స్కైవేకు సంబంధించి డీపీఆర్‌‌ ఇప్పటికే సిద్ధం కాగా, మరో స్కైవే నిర్మాణానికి డీపీఆర్‌ రూపొందుతోంది. వీటికి సుమారు రూ.5 వేల కోట్ల వ్యయం కానున్నట్లు అంచనా వేశారు. ఈ ప్రాజెక్టులను సొంతంగా హెచ్‌ఎండీఏనే చేపట్టనుంది.

ఇరుకు రోడ్ల కారణంగా కంటోన్మెంట్‌ ప్రాంతంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సికింద్రాబాద్‌ నుంచి మేడ్చల్ వైపు ఉండే ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు చేరుకోవాలంటే రద్దీ వేళల్లో గంటకు పైగా సమయం పడుతోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌-కరీంనగర్‌ మార్గంలో జేబీఎస్‌ నుంచి శామీర్‌పేట వరకు 18.50 కిలోమీటర్ల మేర రెండస్తుల స్కైవేను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే, హైదరాబాద్‌-నాగ్‌పూర్‌ మార్గంలో ప్యారడైజ్‌ నుంచి కొంపల్లి తర్వాత వచ్చే ఆర్‌వోబీ వరకూ 18.35 కిలోమీటర్ల మేర డబుల్‌ డెక్కర్‌ స్కైవే వీలు మేరకు సంబంధిత కన్సల్టెన్సీ ప్రభుత్వానికి నివేదికను అందించింది.