మున్సిపాలిటీలో చెత్త శుద్ధి ఏదీ..?

  • వేధిస్తున్న డంపింగ్ యార్డ్ తరలింపు సమస్య
  • అంతర్రాష్ట్ర రహదారిపై చెత్త డంపింగ్
  • చెత్త నుండి సంపద తయారీ శూన్యం
  • లక్షల అధి రూపాయలు ఖర్చే తప్ప కానరాని సెగ్రిగేషన్
  • మున్సిపల్ చెత్త డంపింగ్ యార్డ్ ను పరిశీలించిన జనసేన పార్టీ నాయకులు

పార్వతీపురం: పార్వతీపురం మున్సిపాలిటీలో చెత్త శుద్ధి ఏదని జనసేన పార్టీ నాయకులు ప్రశ్నించారు. శనివారం జనసేన పార్టీ జిల్లా నాయకులు వంగల దాలి నాయుడు, అన్నా బత్తుల దుర్గాప్రసాద్, తామరఖండి తేజ తదితరులు పార్వతీపురం పట్టణంలోని రాయగడ రోడ్ లో ఉన్న చెత్త డంపింగ్ యార్డ్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్వతీపురం మున్సిపాలిటీని దశాబ్దాలుగా వేధిస్తున్న చెత్త డంపింగ్ యార్డ్ తరలింపులో పాలకులు అధికారుల చిత్తశుద్ధి లోపించింది అన్నారు. డంపింగ్ యార్డ్ తరలింపుకు పార్వతీపురం మండలంలోని మరికి, రావికొన బట్టివలస, నర్సిపురం, కొన్నిడివరం తదితర ప్రాంతాలకు తరలిస్తామంటూ పాలకులు, అధికారులు ప్రజలను మభ్య పెడుతున్నారే.. తప్ప తరలింపు చేసే పరిస్థితి లేదన్నారు. ఈ తరలింపు పేరుతో స్థల సేకరణ, డంపింగ్ యార్డు ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే లక్షలాది రూపాయలు వృధా చేశారన్నారు. అలాగే ప్రస్తుత డంపింగ్ యార్డ్ వద్ద చెత్త సెగ్రిగేషన్ కోసం షెడ్లు నిర్మాణం పేరుతో లక్షలాది రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారే తప్ప సెగ్రిగేషన్ కనబడలేదు అన్నారు. ప్రస్తుతం మున్సిపాలిటీలో తయారవుతున్న చెత్తను తీసుకువచ్చి అంతర్రాష్ట్ర ఒడిస్సా రహదారిపై డంప్ చేస్తున్నారన్నారు. దీనివలన ఈ రహదారిలో రాకపోకలు సాగించే వాహన చోదకులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. చెత్త డంపింగ్ యార్డ్ వలన సమీప జట్టు ఆశ్రమం, వివేకానంద కాలనీ, జగన్నాధపురం ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు. అయితే చెత్తలో పొగ మంటలు, లేదంటే రోడ్డుపై కుప్పలు తదితర వాటితో ప్రజలకు నిత్యం అవస్థలు తప్పడం లేదన్నారు. చెత్త డంపింగ్ యార్డ్ తరలించకపోవడం వలన పార్వతీపురం పట్టణం రాయగడ రోడ్డు వైపు పెరిగే పరిస్థితి లేదన్నారు. ఇళ్ల నిర్మాణాలు చేసేందుకు ప్రజలు ముందుకు రావడం లేదన్నారు. అలాగే దాదాపు కోటి రూపాయలతో నిర్మించిన తిరుమల తిరుపతి దేవస్థానం వృధాగా ఉందన్నారు. చెత్త డంపింగ్ కు స్థలం చాలకపోవడంతో సమీపంలోని చెరువును కబ్జా చేస్తున్నారన్నారు. మున్సిపల్ యంత్రాంగం రోడ్డుపై చెత్త వేయడం, చెరువులు కబ్జా చేయటం తదితరు పనులుచేసి నిబంధనలను ఉల్లంఘిస్తోందన్నారు. చిన్నచిన్న గ్రామాల్లో సైతం తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి సంపద కేంద్రాలను నిర్వహిస్తూ వర్మి కంపోస్ట్ లాంటి సంపద తయారు చేస్తున్నాయన్నారు. కానీ పార్వతీపురం మున్సిపాలిటీకి అదేమీ పట్టడం లేదన్నారు. కనీసం సంపద కేంద్రం నిర్వహణ సెగ్రిగేషన్ తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడం తదితరమైనవి చేయకపోవడం ప్రజల దౌర్భాగ్యం అన్నారు. ఇక మున్సిపాలిటీలో మురుగు కాలువల్లో పూడిక తీత పనులతో పాటు పలు వీధుల్లో మురుగు కాలువలు ఏర్పాటు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మొత్తంగా పాలకులు, అధికారుల్లో చెత్తశుద్ధి లోపించిందని ఆరోపించారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి చెత్త డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.