కనీవినీ ఎరుగని విజయం ఇది… అంతే బాధ్యతగా పని చేద్దాం

• జనసేన విజేతల సమావేశంలో పార్టీ పీఏసీ ఛైర్మన్, తెనాలి అసెంబ్లీ విజేత శ్రీ నాదెండ్ల మనోహర్
రాష్ట్ర ప్రజలు కనీవినీ ఎరుగనిరీతిలో జనసేన పార్టీని ఆశీర్వదించారు. ప్రజలకు అండగా నిలబడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. జనసేన పార్టీ సమస్యల పరిష్కారానికి ఏ విధంగా నిలబడుతుందో చేసి చూపుదామని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి అద్భుత నాయకత్వంలో జనసేన పార్టీ ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించగలిగిందన్నారు. రాష్ట్ర ప్రజల కోసం, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం శ్రీ పవన్ కళ్యాణ్ గారు పట్టుదలతో చేసిన ప్రయత్నం అభినందనీయం అన్నారు. 100 శాతం స్ట్రయిక్ రేట్ అన్న అధ్యక్షుల వారి మాటల విలువ ఇప్పుడు అందరికీ అర్ధం అవుతోందన్నారు. ప్రతి సీటు విజయం సాధించాలన్న పట్టుదలతో ఆయన తీసుకున్న నిర్ణయం గర్వించదగ్గ అంశమన్నారు. బుధవారం మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన జనసేన పార్టీ శాసనసభ్యుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, క్షేత్ర స్థాయిలో జనసైనికులు, వీర మహిళలు నిలబడిన తీరు అద్భుతం. ఈ గెలుపు మనందరి మీదా బాధ్యత పెట్టింది. ప్రతి పౌరుడి దగ్గరకు వెళ్లి పార్టీ, ప్రభుత్వం చేసే కార్యక్రమాలు వివరించాలి. మనకి ఇదో సువర్ణ అవకాశం. శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి’’ అని అన్నారు.
• ఈ విజయం అందరి సమష్టి కృషి : శ్రీ నాగబాబు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి
పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు గారు మాట్లాడుతూ “ఒక పార్టీ 100 శాతం విజయం దేశంలో ఎక్కడా వినలేదు. 21 మంది గెలుపు వెనుక 17 సంవత్సరాల అధ్యక్షుల వారి శ్రమ దాగి ఉంది. ఈ 17 ఏళ్లు ఆయన మానసికంగా, శారీరకంగా ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి అందర్నీ విజయ పథంలోకి తీసుకువచ్చారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన వ్యక్తి. మాకు ఆయన నియోజకవర్గంలో పని చేసే అదృష్టం దక్కింది. పిఠాపురంలో పని చేసిన 45 రోజులు ఎంతో నేర్చుకున్నాము. అక్కడ క్షేత్ర స్థాయిలో ప్రజలు, కార్యకర్తలు, వీర మహిళలు చూపిన ప్రేమ అద్భుతం. ఈ ఎన్నికలు ఇద్దరే నడిపారు. ఒకరు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఇంకొకరు సామాన్య ప్రజలు. ప్రతి ఒక్కరూ ఎర్ర కండువా మెడలో వేసుకుని పని చేశారు. ప్రజలు మన మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. మనం బాధ్యతాయుతంగా పని చేస్తే 2029లో మరింత ప్రభావం చూపవచ్చు. హ్యాట్సాఫ్ టూ ప్రెసిడెంట్ గారు.. హ్యాట్సాఫ్ జన సైనికులు” అన్నారు.