ఈ ‘వకీల్‌సాబ్’ కేసుల్నే కాదు అందరి మనసుల్నీ గెలుస్తాడు! : చిరంజీవి

వకీల్‌సాబ్‌పై మెగా హీరోల స్పందన..

హైదరాబాద్‌: మూడేళ్ల తర్వాత మళ్లీ పవన్‌కల్యాణ్‌ అదే వేడి, వాడి, పవర్‌తో కమ్‌బ్యాక్‌ ఇచ్చాడని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. శుక్రవారం రాత్రి కుటుంబసభ్యులతో కలిసి వకీల్‌సాబ్‌ చిత్రాన్ని వీక్షించిన చిరు తాజాగా చిత్రబృందంపై ప్రశంసల వర్షం కురిపించారు. అలాగే సినిమాపై తన అభిప్రాయాన్ని తెలియజేశారు. మరోవైపు నాగబాబు, వరుణ్‌ తేజ్‌, సాయిధరమ్‌తేజ్‌, సుస్మిత సైతం సోషల్‌మీడియా వేదికగా ‘వకీల్‌సాబ్‌’పై ప్రశంసల వర్షం కురిపించారు.

‘ మూడేళ్ల తర్వాత మళ్లీ పవన్‌కల్యాణ్‌ అదే వేడి, వాడి, వపర్‌తో వచ్చాడు. ప్రకాశ్‌రాజ్‌తో కోర్టు రూమ్‌ డ్రామా అద్భుతం! నివేదా థామస్‌, అంజలి, అనన్య వాళ్ల పాత్రల్లో జీవించారు. సంగీతంతో తమన్‌, కెమెరా పనితనంతో వినోద్‌ సినిమాకి ప్రాణం పోశారు. దిల్‌రాజు, బోనీకపూర్‌, వేణుశ్రీరామ్‌తోపాటు మిగతా టీమ్‌కి నా శుభాకాంక్షలు. అన్నింటినీ మించి మహిళలకు ఇవ్వాల్సిన గౌరవాన్ని తెలియజేసే ఒక అత్యద్భుతమైన చిత్రమిది. ఈ వకీల్‌సాబ్ కేసుల్నే కాదు అందరి మనసుల్నీ గెలుస్తాడు!’ – చిరంజీవి

‘మూడేళ్ల ఆకలికి ‘వకీల్‌సాబ్‌’తో జీవితకాలానికి సరిపడా విందు అందించాడు. ఈ సినిమాకి రివ్యూ రాయమని చాలామంది నన్ను అడిగారు. కానీ, నేను నో అని చెప్పాను. ప్రస్తుతం ఎదురవుతున్న ఓ క్లిష్టమైన సమస్యతో వచ్చిన ఈ సినిమా సమాజంలో ఉన్న ప్రతిఒక్కర్నీ ఆకర్షించింది’ – నాగబాబు

‘అబ్జక్షన్‌!! అబ్జక్షన్‌!! అబ్జక్షన్‌!! వాట్‌ ఏ పవర్‌ప్యాక్డ్‌ పెర్ఫామెన్స్‌. కల్యాణ్‌ మామ నటన అద్భుతంగా ఉంది. సరైన సమయంలో వచ్చిన సరైన సినిమాలో సరైన వ్యక్తి నటించారు. బ్లాక్‌బస్టర్‌ వకీల్‌సాబ్‌’ – సాయిధరమ్‌ తేజ్‌

‘బాబాయ్‌ నటన పవర్‌ప్యాక్డ్‌గా ఉంది. వకీల్‌సాబ్‌ నాకెంతో నచ్చింది. నివేదా, అంజలి, అనన్యల నటన ప్రతిఒక్కర్నీ ఆకట్టుకునేలా సాగింది. తెలుగు ప్రేక్షకులకు చేరవయ్యేలా వేణుశ్రీరామ్‌ ఈ రీమేక్‌ను తీర్చిదిద్దారు. తమన్‌ మ్యూజిక్‌ అదిరిపోయింది. సరైన న్యాయం జరిగింది” – వరుణ్‌ తేజ్‌

”వకీల్‌సాబ్‌’ టీమ్‌ మొత్తానికి కంగ్రాట్స్‌. వకీల్‌సాబ్‌ గురించి ఎంత చెప్పినా ఇంకా తక్కువగానే ఉంటుంది. కమర్షియల్‌, ఎంటర్‌టైనింగ్‌, పవర్‌ఫుల్‌గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు’ -సుస్మిత

వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహించిన ‘వకీల్‌సాబ్‌’లో పవన్‌ సత్యదేవ్‌ పాత్రలో లాయర్‌గా కనిపించారు. దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరించారు. ఇందులో శ్రుతిహాసన్‌ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించారు. అంజలి, అనన్య, నివేదా థామస్‌, ప్రకాశ్‌ రాజ్‌ కీలకపాత్రలు పోషించారు. తమన్‌ స్వరాలు అందించారు.