భారత్‌ విజయానికి మరో మూడు వికెట్లు!

చెన్నై వేదికగా చెపాక్‌ స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్‌ పూర్తి ఆధిక్యతతో కొనసాగుతోంది. టీమిండియా బౌలర్లు మరో మూడు వికెట్లు పడగొడితే విజయం భారత్‌ను వరిస్తుంది. రెండో ఇన్నింగ్స్‌ నాలుగో రోజు మంగళవారం ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్‌ 100 పరుగుల స్కోర్‌ నమోదు చేసి ఐదు వికెట్లు కోల్పోయింది. ఇషాంత్‌ శర్మ వేసిన 41వ ఓవర్‌లో ఓలీపోప్‌ బౌండరీ బాదడంతో 100 పరుగుల మార్కును దాటింది. కొద్దిసేపటికే అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో ఓలీపోప్‌ (12) ఔటయ్యాడు. దీంతో ఇంగ్లాండ్‌ 110 పరుగుల వద్ద ఆరో వికెట్‌ కోల్పోయింది. పటేల్‌కు ఇది మూడో వికెట్‌. కుల్‌దీప్ యాదవ్ ఈ మ్యాచ్‌లో తొలి వికెట్ తీశాడు. బెన్ ఫోక్స్ (2)ను వికెట్ పడగొట్టాడు. అక్షర్ పటేల్ అద్భతు క్యాచ్ అందుకున్నాడు. దీంతో ఇంగ్లాండ్ ఏడు వికెట్లు కోల్పోయింది. క్రీజులో రూట్ (33) ఉన్నాడు. భోజన విరామ సమయానికి ఇంగ్లాండ్ 116/7 పరుగులతో కొనసాగుతోంది. ఇంగ్లాండ్‌ విజయానికి 363 పరుగులు కావాల్సి ఉంది.