తిరుపతి, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల

తెలుగు రాష్ట్రాల్లో మరో ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. ఏపీలో తిరుపతి పార్లమెంట్, తెలంగాణలో నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఫలితాలు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు వెలువడనున్నాయి.

అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న తిరుపతి పార్లమెంట్, నాగార్జున సాగర్ అసెంబ్లీ  స్థానాల ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 23వ తేదీన వెలువడనుంది. నామినేషన్ దాఖలు ఈ నెల 30 వ తేదీ చివరి తేదీ కాగా ఏప్రిల్ 17న పోలింగ్ జరగనుంది. ఫలితాలు మాత్రం దేశంలో జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు మే 2న వెలువడనున్నాయి. తిరుపతి ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్‌రావు, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్శింహయ్య ఆకస్మిక మరణంతో ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి.

అసోం ఎన్నికలు మూడు విడతల్లో, తమిళనాడు , కేరళ, పుదుచ్చేరిలలో ఒక విడతలో ఎన్నకలు జరగనుండగా..పశ్చిమ బెంగాల్ లో మాత్రం 8 విడతల్లో జరగనున్నాయి. అసోం ఎన్నికలు మార్చ్ 27, ఏప్రిల్ 1, 6వ తేదీల్లో జరగనున్నాయి. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 6న జరగనున్నాయి. ఇక పశ్చిమ బెంగాల్ ఎన్నికలు మార్చ్ 27, ఏప్రిల్ 1, 6,10,17, 22, 26, 29 వ తేదీల్లో జరగబోతున్నాయి.

తిరుపతి, నాగార్జున సాగర్ ఉప ఎన్నిక లకు సంబంధించి మార్చ్ 23న నోటిఫికేషన్ వెలువడనుంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ మార్చ్ 30 కాగా నామినేషన్ల పరిశీలన మార్చ్ 31గా ఉంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 3 కాగా పోలింగ్ ఏప్రిల్ 17న జరగనుంది. మే 2న ఫలితాలు వెలువడనున్నాయి.