తిరుపతి-పళని బస్సు సర్వీసు ప్రారంభం

  • బస్సు సర్వీసు ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
  • షష్ట షణ్ముఖ యాత్ర సందర్భంగా పళనిలో భక్తులకు ఇచ్చిన హామీని నెరవేర్చిన పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుపతి-పళని మధ్య నూతన ఆర్టీసీ బస్సు సర్వీసును గురువారం ప్రారంభించింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరి క్యాంపు కార్యాలయంలో వేద పండితుల పూజల అనంతరం రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో కలిసి జెండా ఊపి ఈ సేవను ప్రారంభించారు. అనంతరం బస్సులో అందించిన సౌకర్యాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “ఈ ఏడాది ఫిబ్రవరిలో తమిళనాడులో షష్ట షణ్ముఖ యాత్ర సందర్భంగా పళని కొండపై సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్నాను. అప్పట్లో భక్తులు తిరుపతికి వెళ్లేందుకు తగిన సౌకర్యం లేకపోవడం గురించి ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడు స్టేట్ కందన్ ఛారిటబుల్ ట్రస్ట్, పళని టౌన్ సిటిజన్ ఫోరమ్ సభ్యులు బాలాజీ, సుబ్రహ్మణ్యం వినతిపత్రం అందించగా, వెంటనే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లగా, అరగంటలోనే అనుమతి లభించింది,” అని తెలిపారు.

సర్వీస్ వివరాలు:

దూరం: 505 కిలోమీటర్లు

ప్రయాణ సమయం: సుమారు 11 గంటలు

బస్సు ప్రారంభ సమయం: రాత్రి 8 గంటలు

గమ్యస్థానం చేరే సమయం: ఉదయం 7 గంటలు

మార్గం: తిరుపతి → చిత్తూరు → క్రిష్ణగిరి → ధర్మపురి → పళని

టికెట్ ధర: పెద్దలకు ₹680, చిన్నపిల్లలకు ₹380

రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, “తిరుపతి-పళని మధ్య బస్సు సర్వీసు భక్తుల అభీష్టం మేరకు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. ఇది రెండు రాష్ట్రాల భక్తుల మధ్య సుహృద్భావాన్ని పెంపొందించేందుకు సహాయపడుతుంది,” అని అన్నారు.

ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, శాసన మండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్, తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు, ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌ కొనకళ్ల నారాయణరావు, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, నెల్లూరు జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా పసుపులేటి హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp-Image-2025-04-03-at-7.27.57-PM-1024x746 తిరుపతి-పళని బస్సు సర్వీసు ప్రారంభం
WhatsApp-Image-2025-04-03-at-7.27.58-PM తిరుపతి-పళని బస్సు సర్వీసు ప్రారంభం
WhatsApp-Image-2025-04-03-at-7.32.51-PM-1024x682 తిరుపతి-పళని బస్సు సర్వీసు ప్రారంభం

Share this content:

Post Comment