నేడు మాచర్లకు సీఎం జగన్… పింగళి కుమార్తెకు సత్కారం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి శుక్రవారం(మార్చి 12) గుంటూరు జిల్లా మాచర్లలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కుటుంబసభ్యులను సీఎం సన్మానించనున్నారు. జాతీయ పతాకాన్ని రూపొందించి ఈ నెలాఖరుకు వందేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులను గౌరవంగా సత్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రస్తుతం పింగళి వెంకయ్య కుమార్తె సీతామహాలక్ష్మి వయసు 99 ఏళ్లు. మాచర్ల పట్టణంలోని పీడబ్ల్యూడీ కాలనీ సమీపంలో ఉన్న సుద్దగుంతలలో ఆమె నివాసం ఉంటున్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డితో పాటు ప్రభుత్వ విప్,మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి శుక్రవారం ఆమె ఇంటికి వెళ్లనున్నారు.

మాచర్ల పర్యటన కోసం సీఎం జగన్ శుక్రవారం ఉదయం 10.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరుతారు. ఉదయం 11.35 గంటలకు మాచర్ల చేరుకుంటారు. 11.45 పింగళి వెంకయ్య కుమార్తె సీతామహాలక్ష్మి నివాసానికి చేరుకుని… ఆమెను, ఇతర కుటుంబసభ్యులను ఘనంగా సన్మానిస్తారు. అనంతరం అక్కడినుంచి బయలుదేరి మధ్యాహ్నం ఒంటిగంటకు తాడేపల్లిలోని తన నివాసానికి సీఎం చేరుకుంటారు.

రాబోయే అగస్టు 15తో దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో 259 మంది ప్రముఖులతో ఉన్నత స్థాయి జాతీయ కమిటీని ఏర్పాటు చేసింది. మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌, న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్,కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ,ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్,తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్,టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు,సినీ దర్శకుడు రాజమౌళితో పాటు పలువురు కేంద్రమంత్రులు,రాష్ట్రాల ముఖ్యమంత్రులు,గవర్నర్లు,క్రీడాకారులు తదితరులకు ఇందులో కేంద్రం చోటు కల్పించింది.

2021 ఆగస్ట్ 15 నుంచి 2022 ఆగస్ట్ 15 వరకు ఏడాది పాటు వేడుకల నిర్వహణకు ఈ కమిటీ సలహాలు,సూచనలు ఇవ్వనుంది. అటు ఆయా రాష్ట్రాలు కూడా 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి.