ఈ రోజు నేను మరిచిపోలేని రోజు.. ఆసక్తికర ట్వీట్ చేసిన మెగాస్టార్..

మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ అధ్యాయనం.. ఓ సంచలనం.. ఎలాంటి బ్యాగౌండ్ లేకుండా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి నెంబర్ వన్ హీరోగా మారారు. చిన్న చిన్న క్యారెక్టర్లు.. ప్రతినాయకుడి పాత్రలతో కనిపిస్తూ వచ్చిన ఆయన తన నటనతో చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడమే కాకుండా.. మెగాస్టార్‏గా మారారు. ఇక తెలుగు సినీ పరిశ్రమలో బ్రేక్ డ్యాన్స్ పరిచయం చేసింది కూడా చిరు మాత్రమే. ఎదురైన ప్రతి చిన్న సమస్యను చిరునవ్వుతో.. తన నటనతో ఎదుర్కొంటూ.. ప్రస్తుతం చిత్రసీమకే మకుటం లేని మారాజుగా మారారు. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చిరంజీవి అంటే ఓ సంచలనం. ప్రాణం ఖరీదు సినిమాతో చిత్రపరిశ్రమలోకి నటుడిగా ఎంట్రీ ఇచ్చారు చిరంజీవి.

ఈ సినిమా తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన టాప్ హీరోగా ఎదిగారు చిరు. ఖైధీ, జగదేకవీరుడు అతిలోకసుందరి, గ్యాంగ్ లీడర్, ముఠామేస్త్రీ, ముగ్గురు మోనగాళ్లు, మృగరాజు వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసారు. ముఖ్యంగా ఖైదీ సినిమాతో ఆయన కెరీర్‏తో మలుపు తిరిగింది. ఈ మూవీ తర్వాత చిరంజీవి… వరుస సినిమాలతో మెగాస్టార్‏గా మారారు..తనను ఇంతటి స్టార్‏గా మారడానికి గల కారణమైన రోజును గుర్తుచేసుకుంటూ ఆసక్తికర ట్వీట్ చేశారు చిరంజీవి. నటుడిగా తాను ఇదే రోజున సినీ పరిశ్రమలో తెలుగు ప్రజలకు పరిచమయ్యానని గుర్తుచేసుకున్నారు.

ఆగస్ట్ 22 నేను పుట్టినరోజైతే 22Sept నటుడిగా నేను పుట్టినరోజు. కళామతల్లి నన్ను అక్కున చేర్చుకున్న రోజు. మీ అందరికి నన్ను నటుడిగా పరిచయంచేసి మీ ఆశీస్సులు పొందినరోజు.నేను మరిచిపోలేనిరోజు. అంటూ ట్వీట్ చేశారు చిరంజీవి. మెగాస్టార్‏ను తెలుగు ప్రజలకు ఒక నటుడిగా పరిచయం చేసిన ప్రాణం ఖరీదు సినిమా 1978, సెప్టెంబర్ 22న విడుదలైంది. ఈ సినిమా తర్వాత చిరంజీవి వరుస సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరో అయ్యారు. ఇక చిరు తర్వాత పవన్ కళ్యాణ్ , రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్ తమ నటనతో చిరంజీవిని గుర్తుచేశారు. ప్రస్తుతం చిరంజీవి. గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాల్లో నటిస్తున్నాడు. ఇటీవలే కొరటాల శివ దర్శకత్వంలో నటించిన ఆచార్య సినిమా షూటింగ్ పూర్తై విడుదలకు సిద్ధంగా ఉంది.