ఈ రోజు సద్దుల బతుకమ్మవేడుక

బతుకమ్మ సంబురం ఈ నెల 16న మొదలైంది. అప్పటి నుంచి ప్రతి రోజూ ఆడబిడ్డల ఆటపాటలతో వీధివీధీ హోరెత్తుతున్నది. తొమ్మిది రోజులు వివిధ పేర్లతో గౌరమ్మ పూజించిన మహిళలు చివరి రోజు సద్దుల బతుకమ్మగా పూజిస్తారు. ఇప్పటికే చాలాచోట్ల పూలను తెచ్చి ఇళ్లలో భద్రపరిచారు.

శనివారం జిల్లావ్యాప్తంగా సద్దుల బతుకమ్మను ఘనంగా జరుపుకోనున్నారు. బతుకమ్మ పండుగలో ఆఖరి తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో విజయదశమి కంటే సద్దుల బతుకమ్మకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. నిండు మనసారా గౌరమ్మను ఆరాధిస్తారు. మన సంస్కృతి ఉట్టిపడేలా పాటలు పాడుతూ సందడిగా మారనున్నాయి. ఈ బతుకమ్మ వేడుకలు మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమవుతుంది. తర్వాత ఎంగిలి పూల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మతో ఈ ఎనిమిది రోజులు వేడుకలు జరుగుతాయి.

సద్దుల బతుకమ్మ రోజు ఆడబిడ్డలు ఉదయం నుంచే బతుకమ్మలను పేర్చి సాయంత్రం చక్కగా దుస్తులు, ఆభరణాలు ధరించి బతుకమ్మను వాకిలిలో పెడతారు, అనంతరం చుట్టుపక్కన మహిళలతో కలిసి బతుకమ్మ పాటలు పాడుతూ, చీకటి పడుతుందనగా బతుకమ్మలు తలపై పెట్టుకొని ఊరి చెరువుకు ఊరేగింపుగా బయల్దేరి జలవనరుల్లో నిమజ్జనం చేస్తారు. ఆ తర్వాత వాయినాలు ఇచ్చిపుచ్చుకొని సత్తుపిండి పంచుకుంటూ బతుకమ్మ పాటలు పాడుకుంటూ ఇండ్లకు చేరుకుంటారు.