నేడు తొలి ఏకాదశి.. ఈ రోజున పాటించాల్సిన పూజ నియమాలను, విశిష్టతను తెలుసుకుందాం

తొలిఏకాదశి ( 20.07.21) ఏ మంచిపని ప్రారంభించినా దశమి ఏకాదశులకోసం ఎదురుచూడటం ప్రజలకు అలవాటు. ఏడాది పొడుగునా ఉండే 24 ఏకాదశుల్లో, ఆషాఢ శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. ఈ ఏకాదశిని “శయన ఏకాదశి , ప్రధమ ఏకాదశి”, “హరివాసరం” అని కూడా అంటారు. పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సరారంభంగా పరిగణించేవారు. తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్భాన్ని తొలిఏకాదశిగా పరిగణిస్తారు.  అందుకనే ఈ ఏకాదశిని “శయన ఏకాదశి” అంటారని పురాణాల కథనం. తొలి ఏకాదశ నుంచి సూర్యుడు ఉత్తర దిశ నుంచి దక్షిణ దిశకు వాలుతున్నట్టు కనిపిస్తాడు అంతేగాక చాతుర్మాస్య వ్రతం కూడా కొంతమంది ప్రారంభిస్తారు. తొలి ఏకాదశిని చేసేవారు కొన్ని నియమాలను పాటించాల్సి ఉంది. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

*ఏకాదశిని చేసేవారు పండ్లు, పాలు, డ్రై ఫ్రూట్స్, కంద మూలాలు, సగ్గు బియ్యం, సామల తో చేసిన వంటలు తినవచ్చు.

*ఏకాదశి ఉపవాసం చేసేవారు ధాన్యాలు, పప్పులు, శనగలు, మొక్క జొన్న, గోకరకాయ, చిక్కుడుకాయ, బఠాణిలను ఆహారపదార్ధాలుగా తీసుకోకూడదు.

*ఏకాదశి రోజున తులసి ఆకులను తెంపకూడదు.

*ఏకాదశి రోజున శ్రవణం, కీర్తనం, హరి నామ స్మరణం ఎక్కువ చేయాలి.

*ఈరోజున కృష్ణుడిని పూజిస్తే శుభఫలితాలు పొందుతారు.

*ఏకాదశి రోజు కృష్ణుడు పూజించాలి అనుకునేవారు ముందు రోజు తులసి దళాన్ని సిద్ధం చేసుకుని ఏకాదశి రోజున కృష్ణుడిని ధూపం, దీపం, తులసి పత్రాలతో పూజిస్తే శుభఫలితాలు సొంతమవుతాయి.

హరే కృష్ణ హరే కృష్ణ |

కృష్ణ కృష్ణ హరే హరే ||

హరే రామ హరే రామ|

రామ రామ హరే హరే || అనే ఈ మహా మంత్రాన్నిఎన్ని సార్లు జపిస్తే అంత మంచిది.

ఆషాఢమాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి , శ్రీహరి నిష్ఠ నియమాలతో పూజించాలి. పూజ గదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి ప్రతిమకు లేదా పటానికి పసుపు, కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి. తర్వాత చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టి కర్పూర హారతివ్వాలి. ముఖ్యంగా ఏకాదశి రోజున పూజ చేసినా చెయ్యకపోయినా మాంసము, చేపలు, గుడ్లు, పుట్ట గొడుగులు, మద్యం, ఉల్లిపాయ, వెల్లుల్లి, మత్తుపదార్ధాలకు దూరంగా ఉండడం మంచిది. ఏకాదశిని చేసిన వారు మర్నాడు ద్వాదశి రోజు ఉదయమే స్నానం చేసి, విష్ణు మూర్తికి పూజ చేసి ఉపవాస నియమాన్ని విడిచి పెట్టాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *