నేడు టిడిపి ‘సాధన దీక్ష’

కరోనా బాధితులను ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం సాధన దీక్షలకు టిడిపి పిలుపునిచ్చింది. కరోనాతో మరణించిన కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున ఇవ్వాలని, ఆక్సిజన్‌ అందక చనిపోయిన కుటుంబాలకు రూ.25 లక్షలు, కరోనా విధులు నిర్వహిస్తూ మరణించిన ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ కుటుంబాలకు రూ.50 లక్షలు, తెల్లరేషన్‌ కార్డు ఉన్న కుటుంబానికి, జీవనోపాధి కోల్పోయిన చిరు వ్యాపారులకు రూ.10 వేలు ఆర్థిక సహాయం చేయాలని టిడిపి డిమాండ్‌ చేస్తుంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మంగళగిరిలోని టిడిపి రాష్ట్ర కార్యాలయం ఎన్‌టిఆర్‌ భవన్‌లో పార్టీ అధినేత చంద్రబాబు దీక్ష చేయనున్నారు. ఈ దీక్షకు మద్దతుగా 175 నియోజక వర్గాల్లో దీక్షలు చేయాలని చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పార్టీ ముఖ్యనేతల సమావేశం సోమవారం నిర్ణయం తీసుకుంది. 2.3 లక్షల ఉద్యోగాల భర్తీపై సిఎం ఇచ్చిన హామీని అమలు చేయాలని, నిరసన తెలుపుతున్న యువతను అరెస్టులు, గృహ నిర్బంధం చేయడాన్ని ఖండించింది. ఎన్‌టిఆర్‌ భవన్‌లో దీక్షలో చంద్రబాబుతోపాటు ఆ పార్టీ నేతలు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, నిమ్మల రామానాయుడు, వర్ల రామయ్య, అశోక్‌ బాబు, బొండా ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొంటారు.