గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి ‘క్యూ’ కడుతున్న బీజేపీ అగ్రనేతలు

గ్రేటర్ హైదరాబాద్ పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ఎన్నికల ప్రచారాలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాగైనా మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని బీజేపీ అన్ని వ్యూహాలను తమ అమ్ముల పొదిలోంచి తీస్తోంది. కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్రనేతలు అందరూ భాగ్యనగరంలో ప్రచారానికి ‘క్యూ’ కడుతున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రులు ప్రకాశ్ జవదేకర్, స్మృతి ఇరానీ ఇప్పటికే పర్యటించి వెళ్లారు. మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, తేజస్వీ సూర్య కూడా వచ్చి వెళ్లారు. అయితే మరో హఠాత్పరిణామం చోటు చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన కూడా ఖరారైంది. 29 న మోదీ హైదరాబాద్‌కు రానున్నారు. భారత్ బయోటెక్‌లో కరోనా వ్యాక్సిన్ పురోగతిని ప్రధాని పరిశీలించనున్నారు. అయితే జీహెచ్‌ఎంసీ ఎన్నికల వేళ మోదీ రాక ఉత్కంఠ రేపుతోంది.

మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ప్రచారానికి రానున్నారు. అయితే ఆయన పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం 28 న ప్రచారానికి రావాల్సి ఉంది. మారిన షెడ్యూల్ ప్రకారం శుక్రవారమే నడ్డా ప్రచారానికి రానున్నారు. సాయంత్రం 4 గంటలకు నాగోల్ రోడ్‌షోలో ఆయన పాల్గొంటారు. ఈ నెల 29 న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కూడా నగరానికి రానున్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో నిర్వహించే రోడ్‌ షోలో ఆయన పాల్గొంటారు. ఇక… యూపీ సీఎం, ఫైర్‌బ్రాండ్ యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం జరిగే ప్రచారంలో పాల్గొననున్నారు. హైదరాబాద్, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఆయన ప్రచారం నిర్వహించనున్నారు. ఇలా గ్రేటర్ ఎన్నికల్లో అతిరథ మహారథులందర్నీ బీజేపీ బరిలోకి దింపింది.