టార్చ్ బేరర్

ఉపయోగంలేని ఉప్పు, వెలగని దీపం, చాటుగా వెలిగే దీపం విలువ లేనివి.. మనం అనుక్షణం అభద్రతాభావం, ఒత్తిడి, ఆందోళనల్లో కొట్టుమిట్టాడుతూ ప్రతి రోజూ చస్తూ బతుకుతున్నాం. ఉప్పు రుచినిస్తుంది, ఆహార పదార్థాలు పాడవకుండా కాపాడుతుంది, ఉప్పుతో కట్టుకడితే గాయం మానుతుంది. ఉప్పు శరీరానికి శక్తినిస్తుంది. డబ్బాలో ఉన్న ఉప్పు వల్ల ఉపయోగం లేదు. అందులోనుంచి బయటికొచ్చి కూరలో కలిసిన ఉప్పుతోనే రుచి వస్తుంది. కాకపోతే అలా కలిసిపోయిన ఉప్పు మన కంటికి కనిపించదు. అలా సమాజంలో కలిసిపోయిన గొప్పవాళ్లే సమాజాన్ని ప్రభావవితం చేసి దాన్ని ప్రక్షాళన చెయ్యగలరు. అలాగే సమాజంలో ప్రజల ముందు వెలుగుతూనే ఉంటారు.

తాను వెలుగుతూ ఇతరులకు దారి చూపించేవాడే టార్చ్ బేరర్… దిగజారుతున్న సమాజాన్ని ఆదుకోవడంలో అతని పాత్ర కీలకం.. ఉప్పు, వెలుగులా టార్చ్ బేరర్ కూడా మౌనంగా తమ పని తాము చేసుకుంటూ కాగడా పట్టుకుని ముందు నిలుస్తాడు. ప్రపంచం ఎంతో అభివృద్ధి చెందుతున్నట్లు కనిపిస్తున్నా నైతిక, ఆత్మీయ విలువలు పూర్తిగా అడుగంటుతూ, లోలోపల అది కుళ్ళిపోతోందని తెలిసినవారు టార్చ్ బేరర్ లా సమాజంలో మార్పు కోసం ప్రయత్నిస్తూనే ఉంటారు. అలా చేయకపోతే భావితరాలకు వారు బతకలేని ఒక బ్రష్టు పట్టిన సమాజాన్ని తాము అందించవలసి వస్తుంది. నా ఈ 50 సంవత్సరాలు పైబడిన జీవిత ప్రయాణంలో ముఖ్యంగా గత రెండు దశాబ్దాల కాలంలో నన్ను బాగా ప్రభావితం చేసిన వ్యక్తి, మళ్లీ అలాంటి టార్చ్ బేరర్ మార్గదర్శి నాకు కనిపించాడు. ఆయనే పవన్ కళ్యాణ్ సమాజంలో, రాజకీయాల్లో మార్పు తీసుకురావడానికి ఒకతరం అంటే పాతిక సంవత్సరాల ప్రయాణం చేయడానికి విలాసవంతమైన వ్యక్తిగత జీవితం వదులుకుని సమాజం కోసం వచ్చాడు. ఆయన ప్రతి కదలికను ఇష్టంతో వెంటాడిన నాకు ఇతరులకంటే ఎక్కువ తెలిసే అవకాశం వచ్చింది. నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఎన్నో గంటలు, ఎన్నో రోజులు ఏకలవ్య శిష్యుడిగా నాకు తెలియకుండానే ఆలోచింప చేశాడు. అన్నా, బాధ నాదయితేనే కన్నీరు కార్చాలా? అని ప్రశ్నించే హృదయం మీది, నేను చూసిన వ్యక్తి కళ్యాణ్.. దాని ఫలితమే నాలోని మరో వ్యక్తి కోణం పరిచయం అయ్యింది.

సంచలనం ఎప్పుడూ మౌనంగానే ఉంటుంది. మద్దతు కూడా తక్కువగానే లభిస్తుంది. అద్భుతం జరిగేముందు ఎవరూ గుర్తించరు జరిగాక గుర్తించవలసిన అవసరం రాదు. ఈ అద్భుతాన్ని ముందే గుర్తించిన వాళ్ళలో నేనూ ఒకడిని, పవన్ కళ్యాణ్ ఒక నిజం, సమాజం పట్ల ఆలోచన ఉన్నవాడు, ఒంటరిగా కనిపించే సమూహం ఆయన, కొన్ని లక్షల గుండెలను పాలిస్తున్న రాజు అయన, మౌనం సహనం ఆయన కవచాలు.

ఈతరంలో ఇమడలేని సిద్ధాంతాలతో జీవించే ఒక ఆశావాది మీరు…మీ అనుచరుడను నేను.

గోపాలకృష్ణ,
రాజేంద్రనగర్ నియోజకవర్గం.