ఓటర్లను ప్రలోభపెడితే కఠిన చర్యలు

గ్రేటర్‌ ఎన్నికల నేపథ్యంలో సైబరాబాద్‌ పరిధిలో భద్రతా ఏర్పాట్లపై సీపీ సజ్జనార్‌ మాట్లాడుతూ.. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 38 వార్డులకు పోలింగ్‌ నిర్వహణ జరుగుతున్నట్లు తెలిపారు. 2,497 పోలింగ్‌ కేంద్రాల్లో 220 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించినట్లు చెప్పారు. ఎన్నికల విధుల్లో 13,500 మంది పోలీసులు పాల్గొంటున్నారు. వీరిలో వెయ్యి మంది సివిల్‌, 3,500 మంది ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ పోలీసులు ఉన్నట్లు తెలిపారు. అదేవిధంగా 177 రూట్‌ మొబైల్‌ వాహనాలు, కొన్నిచోట్ల స్టాటిక్‌ రిజర్వ్‌ టీమ్‌లు అందుబాటులో ఉంచామన్నారు. కమిషనరేట్‌ పరిధిలో ఇప్పటికే రూ.25 లక్షల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 12 ఎస్‌వోటీ బృందాలు తిరుగుతున్నాయన్నారు. పోలింగ్‌ జరిగే ప్రాంతాల్లో లక్ష సీసీ టీవీ కెమెరాలు ఉన్నాయన్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన ఏడుగురిపై కేసులు నమోదు చేసినట్లు సీపీ తెలిపారు.