పరుచూరి ఇంట విషాదం

తెలుగు సినీపరిశ్రమ దిగ్గజాలు పరుచూరి బ్రదర్స్ ఇంట విషాదం నెలకొంది. సీనియర్ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు భార్య విజయలక్ష్మి (74) గుండె పోటుతో కన్ను మూశారు. ఈ రోజు (శుక్ర‌వారం) తెల్లవారుజామున గుండెపోటుతో ఆమె తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆరోగ్య ప‌రిస్థితి విషమించ‌డంతో హైదరాబాద్‌లోని తన స్వగృహంలో మృతి చెందారు. విజయలక్ష్మి మరణవార్త తెలిసి పలువురు మూవీ ఆర్టిస్టుల సంఘం సహా పలు అసోసియేషన్లు తమ సానుభూతిని వ్యక్తం చేశాయి.

పరుచూరిని మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, మోహన్ బాబు సహా పలువురు ప్రముఖులు పరామర్శించారు. పరిశ్రమ అగ్ర హీరోలందరితోనూ పరుచూరి బ్రదర్స్ అనుబంధం గురించి తెలిసినదే. విజయలక్ష్మి గారి మరణం పరుచూరి కుటుంబానికి తీరని లోటు అని వీరంతా ఆవేదన వ్యక్తం చేశారు.