విజయనగరం జనసేన ఆధ్వర్యంలో గురజాడకు ఘననివాళి

  • నవయుగ వైతాళికుడు గురజాడ
  • జనసేన నాయకులు ఆదాడ మోహనరావు

విజయనగరం, జనసేన పార్టీ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ఆదాడ మోహనరావు, త్యాడ రామకృష్ణారావు(బాలు) గురజాడ అప్పారావు వారి గృహములో ఉన్న మహాకవి గురజాడ అప్పారావు విగ్రహానికి 160వ జయంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు అదాడ మోహనరావు మాట్లాడుతూ ప్రపంచానికే స్ఫూర్తి ప్రదాత మహాకవి గురజాడ అప్పారావు నవయుగ వైతాళికుడు అని అన్నారు. గురజాడ 150 వ జయంతోత్సవాల సందర్భంగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గురజాడ గృహాన్ని మ్యూజియంగా చేస్తామని, గురజాడ ఓపెన్ ఆడిటోరియాన్ని అభివృద్ధి చేస్తామని అందుకోసం సుమారు 100 కోట్లు కేటాయించడం జరిగిందని ఆదాడ గుర్తు చేశారు. ఆ వెంటనే 2014లో ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గురజాడ జయంతులకి, వర్ధంతుల సందర్భంగా చేసిన కార్యక్రమాల్లో మ్యూజియంను, ఆడిటోరియంను మా ప్రభుత్వ హయాంలో పూర్తి చేస్తామని చెప్పి ప్రకటనలకే పరిమితం చేసారని ఆదాడ విమర్శ చేశారు. అప్పటి ప్రతిపక్షంలో ఉన్న నేడు అధికారంలో ఉన్న వైఎస్సార్ పార్టీ ప్రజాప్రతినిధులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గగ్గోలు పెట్టారన్నారు. నేడు వైసీపీ అధికారంలోకి వచ్చి మూడున్నారేళ్లు పూర్తికావస్తున్నా వీళ్ళు కూడా పట్టించుకోకపోవడం చాలా బాధాకరం అని అన్నారు. ప్రభుత్వాలు మారిపోతున్నా గురజాడకి తీవ్రమైన అవమానం జరుగుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇటువంటి మహానుభావుల పేర్లును జయంతులకు, వర్ధంతులకే స్మరిస్తున్నారని, తరువాత విస్మరిస్తున్నారని ఆరోపించారు. పట్టణంలో ప్రధాన కూడళ్లకు, ప్రభుత్వ భవనాలకు ఇటువంటి మహానుభావుల పేర్లను పెట్టాలని జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నట్లు ఆదాడ తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పిడుగు సతీష్, దంతులూరి రామచంద్ర రాజు, కొయ్యాన లక్ష్మణ్ యాదవ్, పత్రీ సాయి, కుమార్ పాల్గొన్నారు.