బీజేపీలో చేరిన టీఆర్ఎస్ నేత స్వామిగౌడ్

టీఆర్ఎస్ నేత, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరారు. కొంతకాలంగా టీఆర్ఎస్‌ పార్టీకి దూరంగా ఉంటున్న స్వామిగౌడ్ పార్టీ మారబోతున్నారని ప్రచారం జరిగింది. అనుకున్నట్లుగానే స్వామిగౌడ్ బీజేపీలో చేరారు.

ఈ సందర్భంగా స్వామిగౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘బీజేపీలో చేరడం తిరిగి నా మాతృసంస్థకు వచ్చినట్లు ఉంది. నా ఇంటికి తిరిగి చేరానని భావిస్తున్నాను. ఎలాంటి పదవులు ఆశించి బీజేపీలో చేరలేదు. తెలంగాణ ఉద్యమ కారులకు గౌరవం దొరుకుతుందని టీఆర్ఎస్‌ పార్టీలో చేరానని కానీ అక్కడ జరిగేది వేరే విధంగా ఉందని తెలిపారు. వందసార్లు కేసీఆర్ అపాయింట్‌మెంట్ కోరానని కానీ రెండేళ్లలో ఒక్కసారి కూడా అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు. తెలంగాణ కోసం ఒక్క నాడు కూడా పోరాడని వారికి టీఆర్ఎస్‌లో పదవులు ఇచ్చారు. తెలంగాణ కోసం పోరాడిన వారిని పక్కన పెట్టారు. తండ్రిలాంటి కేసీఆర్ ఈ విషయంలో ఎందుకు అలసత్వం వహించారో అర్థం కాలేదు. టీఆర్ఎస్‌లో తనకు చాలా అవమానం జరిగిందని ఇప్పటికీ చాలామంది ఉద్యమకారులకు అవమానం జరుగుతుందని చెప్పుకొచ్చారు. తన సొంత గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నేత తనను పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ అధినేత నుంచి అనుమతి లేకుండా ఇలాంటివి జరగవని అన్నారు.